అక్షరటుడే వెబ్‌డెస్క్: Vijayasai Reddy New Party | ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావానికి రంగం సిద్ధమవుతోంది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి త్వరలోనే కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీ రాజకీయాల్లో టీడీపీ, వైసీపీలకు ప్రత్యామ్నాయంగా ఒక బలమైన మూడో వేదిక రావాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. గతంలో విజయదశమి తర్వాత కొత్త పార్టీ పెడతామని ప్రకటించిన ఆయన, తాజా వ్యాఖ్యలతో ఆ ప్రకటనపై పూర్తి స్పష్టతనిచ్చారు.
Vijayasai Reddy New Party | యువతకు సీఎం అవకాశం..
రాష్ట్రాన్ని చంద్రబాబు, జగన్ కుటుంబాలే గుత్తాధిపత్యంతో పాలిస్తున్నాయని విజయసాయిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. పార్టీల అధ్యక్షులు వేల కోట్లతో అత్యంత ధనవంతులుగా మారుతుంటే, సామాన్య ప్రజలు మాత్రం ఇప్పటికీ పేదరికంలోనే మగ్గిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2029 ఎన్నికల్లో టీడీపీకి ఓటేస్తే నారా లోకేష్, వైసీపీకి ఓటేస్తే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారని.. కానీ తమ పార్టీ అధికారంలోకి వస్తే యువతరం నుంచి ఎవరైనా సామాన్యులు కూడా ముఖ్యమంత్రి అయ్యే గొప్ప అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.
Vijayasai Reddy New Party | రాయలసీమ వలసలపై ఆందోళన..
ఏపీ ఆర్థిక పరిస్థితిపై ధ్వజమెత్తిన ఆయన.. రాష్ట్రంలో ప్రతి వ్యక్తిపై, చివరికి పుట్టబోయే పసిబిడ్డపై కూడా రూ.5 లక్షలకు పైగా అప్పుల భారం మోపారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో గంజాయి సాగు విచ్చలవిడిగా పెరిగిపోయిందని ఆరోపించారు. టీడీపీ, వైసీపీలకు రాయలసీమ గడ్డ కేవలం ఓట్ల కోసమే ఉపయోగపడుతోందని, ఆ రెండు పార్టీల హయాంలో ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టూ పూర్తి కాలేదని విమర్శించారు. ఏపీలో అత్యధిక వలసలు రాయలసీమ ప్రాంతం నుంచే జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
Vijayasai Reddy New Party | అన్ని కులాలకు సమప్రాధాన్యం..
తమ కొత్త పార్టీ అన్ని కులాలను సమానంగా గౌరవిస్తుందని విజయసాయిరెడ్డి భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే వెనుకబడిన రాయలసీమను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి నిజమైన ‘రతనాల సీమ’గా మారుస్తామన్నారు. రాష్ట్రంలో పేదలకు, ధనికులకు మధ్య విద్యావిధానంలో ఉన్న అంతరాలను తొలగిస్తామని, ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ అభివృద్ధిలో వెనుకబడిందని, రాయలసీమ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ప్రాంతీయ అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని ఆయన వెల్లడించారు.
రెడ్ల ఆత్మ గౌరవం కాపాడే పార్టీ నేను పెట్టబోయే పార్టీ
– విజయ సాయిరెడ్డి pic.twitter.com/mTGhxSdvof
— Reddy_Community (@Reddy_Community) September 18, 2026
ఇది కూడా చదవండి: GST Officer Bribery | రూ.8 లక్షల లంచం తీసుకుంటూ చిక్కిన జీఎస్టీ అధికారి