అక్షరటుడే, వెబ్‌డెస్క్: Revanth Reddy NTR | తెలంగాణ రాష్ట్ర నాయకత్వానికి మండవ వెంకటేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు, మాధవరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు వంటి అతిరథ నాయకులను అందించిన మహనీయుడు ఎన్టీఆర్ అని ముఖ్యమంత్రి రేవంత్ పేర్కొన్నారు.
అంతదాకా ఎందుకు..? కేసీఆర్‌కు కూడా రాజకీయ భిక్ష పెట్టింది అన్నగారేనని చెప్పుకొచ్చారు. అలాంటి గొప్ప నాయకుడి నీడన బతికినవారు, ఈ రోజు ఆయన గురించే తక్కువ చేసి మాట్లాడుతుండటం సంస్కారం కాదని విమర్శించారు.
హైదరాబాద్‌లోని మైత్రీవనం చౌరస్తాలో గురువారం దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) విగ్రహావిష్కరణ మహోత్సవం నిర్వహించారు. సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Revanth Reddy NTR | ఆ ముగ్గురు జాతిరత్నాలు
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. భారత్ చరిత్రలో ఎప్పటికీ స్మరించుకోవాల్సిన గొప్ప నేతల్లో ఎన్టీఆర్ ఒకరని పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, ఇందిరాగాంధీ తర్వాత ఆ స్థాయిలో నిలిచే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఇందిరమ్మ, ఎన్టీఆర్ ఆశయాల కలయికే తమ ప్రజా పాలన అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
భారతదేశం ఉన్నంత కాలం, మానవ మనుగడ కొనసాగినంత కాలం ఈ ముగ్గురు జాతిరత్నాల కీర్తి, ప్రతిష్టలను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
Revanth Reddy NTR | విమర్శలకు భయపడను..
ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారని, గ్రేటర్ హైదరాబాద్ నగర నడిబొడ్డున ఆయన విగ్రహాన్ని పెట్టడం ఎంటనే.. వస్తున్న విమర్శలను సీఎం రేవంత్ తిప్పికొట్టారు. ఎన్టీఆర్ తెలుగుజాతి గర్వించదగిన బిడ్డ అని అన్నారు.
అందుకే కుల, మత, ప్రాంతాలకు అతీతంగా మైత్రీవనం చౌరస్తాలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించామని సమర్థించుకున్నారు. ఒక సీఎంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం తన జీవితకాలం గుర్తుండిపోయే మధుర ఘటనగా వర్ణించారు. ఈ విషయంలో తాను ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
DK Shivakumar Biography | ట్రబుల్ షూటర్.. కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని…


