అక్షరటుడే, ఆర్మూర్: Armoor Police | అప్పు చెల్లించడంలో గొడవ ముదిరి ఏకంగా ఇంటికి పెట్రోల్ పోసి నిప్పు పెట్టేంతవరకు వెళ్లింది. ఈ ఘటన పిప్రి (Pipri) గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.
Armoor Police | వడ్డీ విషయంలో గొడవ..

ఆర్మూర్ (Armoor) ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. పిప్రి గ్రామానికి చెందిన రాజమల్లు 2019లో అదే గ్రామానికి చెందిన అబ్దుల్ బారీకి రూ.5 లక్షలు అప్పు ఇచ్చాడు. అప్పటి నుంచి డబ్బులు అడుగుతుండగా, ఆర్నెళ్ల క్రితం అబ్దుల్ బారీ అసలు రూ.5 లక్షలు ఇచ్చి, వడ్డీ రూ.2 లక్షలకు ఎస్బీఐ (SBI) చెక్కు ఇచ్చాడు. ఎనిమిది నెలల తర్వాత డ్రా చేసుకోవాలని సూచించాడు. అయితే అత్యవసర పరిస్థితిలో డబ్బులు అవసరం ఉండడంతో రాజమల్లు శుక్రవారం బ్యాంక్‌కు వెళ్లి చెక్కుతో రూ.1.75 లక్షలు డ్రా చేసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన అబ్దుల్ బారీ 35 లీటర్ల పెట్రోల్ క్యాన్‌తో రాజమల్లు ఇంటికి వెళ్లాడు. ఆయన కుటుంబ సభ్యులపై, ఇంట్లో పెట్రోల్ చల్లి నిప్పు అంటించాడు.
రాజమల్లు, భార్య, కూతురు తృటిలో ప్రాణాలతో బయటపడగా ఇల్లు పూర్తిగా కాలిపోయింది. చుట్టుపక్కల వారు వెంటనే స్పందించకుంటే వారు సైతం అగ్నికి ఆహుతయ్యే వారని పలువురు పేర్కొన్నారు. ఆ తర్వాత అబ్దుల్ బారీ అన్న అబ్దుల్ బాబర్ వచ్చి ఎప్పటికైనా అందరినీ చంపేస్తానని బెదిరించాడని రాజమల్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.

ఇది కూడా చదవండి: Srivari Vaidya Seva | ‘శ్రీవారి వైద్య సేవ’ ప్రారంభం.. వైద్య నిపుణులకు టీటీడీ ఆహ్వానం
