BRS Farmers Criticism | రైతులపై కాంగ్రెస్‌ వైఖరి ద్రోహపూరితంగా ఉంది: బీఆర్​ఎస్​ నేతల విమర్శ

Naresh Chandan

అక్షరటుడే భీమ్ గల్ (వేల్పూర్): BRS Farmers Criticism | తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే అన్నపూర్ణగా నిలిపిన రైతాంగాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా నిరాశపరుస్తూ, వారిపై ద్రోహపూరిత వైఖరిని ప్రదర్శిస్తోందని బాల్కొండ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపించారు.

వేల్పూర్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ డీసీసీబీ డైరెక్టర్, మెండోరా మండల అధ్యక్షుడు శేఖర్ రెడ్డి, కమ్మరపల్లి మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్ మాట్లాడారు.

BRS Farmers Criticism | రైతులపై మరణశాసనం

కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కోటా మేరకే పంటలు కొనుగోలు చేస్తామని, అదనంగా ఒక్క గింజ కూడా కొనబోమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం… తెలంగాణలోని 70 లక్షల మంది రైతుల భవిష్యత్తుపై మరణశాసనం రాయడమేనని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నికల సమయంలో అన్ని పంటలను చివరి గింజ వరకు కొనుగోలు చేసి, బోనస్ కూడా చెల్లిస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ నాయకత్వం… ఇప్పుడు కేంద్రం కోటాను సాకుగా చూపి చేతులెత్తేయడం రైతాంగాన్ని నట్టేట ముంచడమేనని విమర్శించారు. గతంలో రైతుల పక్షాన పోరాడుతామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఈ నిర్ణయంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

BRS Farmers Criticism | కేసీఆర్‌ హయాంలో వ్యవసాయ విప్లవం

గతంలో కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతును కేంద్రబిందువుగా చేసుకుని పాలన సాగించిందని వారు గుర్తుచేశారు. మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి చారిత్రాత్మక పథకాలతో రాష్ట్రంలో వ్యవసాయ విప్లవానికి నాంది పలికారని కొనియాడారు.

రైతుల ఖాతాల్లో నేరుగా రూ.లక్ష కోట్లకు పైగా జమ చేసి బీఆర్‌ఎస్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతుబంధు పెంపు హామీని విస్మరించిందని, రైతుబీమా ప్రీమియం చెల్లింపుల్లో నిర్లక్ష్యం చేస్తూ, యూరియా కొరతతో రైతులను ఇబ్బందులపాలు చేస్తోందని ఆరోపించారు.

BRS Farmers Criticism | పోరాటం ఆపేది లేదు

రాష్ట్రంలో పండే ప్రతి పంటను చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు పూర్తి న్యాయం చేయాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అన్నదాతలను ఏకం చేసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. రైతుల హక్కుల కోసం తాము చివరి శ్వాస వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ నాయకులు జైడి నాగధర్ రెడ్డి, కల్లెడ ఏలీయా, బద్దం నర్సారెడ్డి, రాజ పూర్ణనందం, బద్దం చిన్నారెడ్డి, రేగుల్లా రాములు, సర్పంచ్ మొండి అశోక్, ప్రతాప్ రెడ్డి, డోళ్ళ రాజేశ్వర్, ఎక్స్ ఎంపీటీసీ రాములు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

NEET Exam Pressure | విద్యార్థుల గుండెల్లో ‘ఒత్తిడి’ చిచ్చు.. ఊపిరి తీస్తున్న ‘మెడికల్’ కల!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *