అక్షరటుడే, కామారెడ్డి : Minor Driving | వయసేమో 16.. చేతిలో రూ.4 లక్షల ఖరీదైన స్పోర్ట్స్ బైక్. ఇంకేముంది రయ్ రయ్ అంటూ రోడ్లపై సర్కస్ ఫీట్లు. కట్ చేస్తే ఒకరి ప్రాణం గాలిలో కలిసిపోయింది. మైనర్ల వాహనాల డ్రైవింగ్‌ను కంట్రోల్ చేయడంలో వారి తల్లిదండ్రులు, పోలీసులు విఫలం అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. మైనర్ డ్రైవింగ్ ప్రమాదకరం అని నామమాత్రానికే చెప్తున్నారని, కట్టడి చేయడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలం అవుతుందన్న ప్రచారం సాగుతోంది.
Minor Driving | కామారెడ్డి నియోజకవర్గంలో..
కామారెడ్డి (Kamareddy) పట్టణంతో పాటు శివారు ప్రాంతాల్లో మైనర్ డ్రైవింగ్, సర్కస్ విన్యాసాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. వచ్చి రాని డ్రైవింగ్‌తో రోడ్లపైకి వెళ్లి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. విపరీతమైన శబ్దాలు కలిగిన వాహనాలతో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. మందలించాల్సిన తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహిస్తున్నారు. కఠిన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఇతర ముఖ్యమైన విధుల్లో పట్టించుకోవడం లేదన్న ప్రచారం సాగుతోంది. ఇలాంటి క్రమంలో మైనర్ డ్రైవింగ్ కట్టడి చేయడం ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
Minor Driving | ఫ్రీ హ్యాండ్ ఇస్తున్న తల్లిదండ్రులు
పిల్లలపై అతి ప్రేమ, స్టేటస్ కోసం రూ.లక్షలు పోసి స్పోర్ట్స్ బైకులు కొనిస్తున్నారు కొందరు తల్లిదండ్రులు. బాగా చదివితే బైక్ కొనిస్తామని ఊరిస్తున్నారు. 18 ఏళ్లు నిండకుండా, లైసెన్స్ లేకుండా వాహనం ఇవ్వడం నేరమని తెలిసినా పట్టించుకోవడం లేదు. మోటార్ వాహన చట్టం ప్రకారం మైనర్‌కు వాహనం ఇస్తే యజమాని అంటే తల్లిదండ్రులకే రూ.25 వేలు జరిమానా, 3 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. వాహన రిజిస్ట్రేషన్ కూడా ఏడాది పాటు రద్దు అవుతుంది. అయినా భయం లేకుండా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం ఆందోళన కలిగిస్తోంది.
Minor Driving | స్పోర్ట్స్ బైకులతో మైనర్ల విన్యాసాలు

కామారెడ్డి పట్టణంలో సాయంత్రం అయిదంటే చాలు.. స్పోర్ట్స్ బైకుల హవా మొదలవుతుంది. సైలెన్సర్లు మార్చి విపరీతమైన శబ్దాలతో, వీలింగ్, త్రిబుల్ రైడింగ్ చేస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ప్రధాన రోడ్లు, కాలేజీ పరిసరాలు వీరికి సర్కస్ మైదానాలుగా మారాయి. దీంతో సాధారణ ప్రజలు, వృద్ధులు, మహిళలు రోడ్డు దాటాలంటేనే భయపడుతున్నారు. వీరి నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల ఎప్పుడు ఎవరికి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.
Minor Driving | ప్రాణం తీసిన మైనర్ డ్రైవింగ్
కామారెడ్డి మండలం ఇల్చిపూర్ శివారులో గత వారం 16 ఏళ్ల మైనర్ నడిపిన బైక్ ఎదురుగా వస్తున్న మరో బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎదురుగా వస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మైనర్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇలాంటి ఘటనలు వెలుగుచూడటం ఇటీవల కొత్తేమి కాదు. ప్రతి ప్రమాదం తర్వాత రెండు రోజులు హడావుడి చేసి ఆపై మర్చిపోవడమే పరిపాటిగా మారింది. ఒక్కో ప్రాణం గాల్లో కలిసిపోతున్నా మార్పు రావడం లేదు.
Minor Driving | పట్టించుకోని పోలీసులు, మైనర్ల తల్లిదండ్రులు
మైనర్ డ్రైవింగ్ ప్రమాదకరం అని పోలీసుశాఖ (Police Department) నామమాత్రానికే చెప్తోందన్న అపవాదు ఉంది. కఠిన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఇతర ముఖ్యమైన విధుల్లో తలమునకలై ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదన్న ప్రచారం సాగుతోంది. స్పెషల్ డ్రైవ్‌లు, కాలేజీల వద్ద తనిఖీలు అరకొరగానే జరుగుతున్నాయి. మందలించాల్సిన తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహిస్తుండగా, చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. దీంతో మైనర్ డ్రైవింగ్‌ను కట్టడి చేయడం ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
Minor Driving | స్పెషల్ డ్రైవ్ చేపడతాం
– రాజేష్ చంద్ర, ఎస్పీ కామారెడ్డి
మైనర్ డ్రైవింగ్ పై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. త్వరలో మైనర్ డ్రైవింగ్ కట్టడి కోసం స్పెషన్ డ్రైవ్ చేపడతాం. కళాశాలలు, పాఠశాలల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వాటిని మరింతగా కొనసాగిస్తాం. మైనర్లకు వాహనాలు ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు ఆలోచించాలి. పిల్లలకు ఏది, ఎంతమేరకు అవసరమో వాటిని మాత్రమే ఇవ్వాలి.
ఇది కూడా చదవండి..: School Admissions | అనుమతులు లేకున్నా ‘కార్పొరేట్’ పాఠశాలల అడ్మిషన్లు.. సీజ్నకు డీఈవో ఆదేశాలు..