అక్షరటుడే, కామారెడ్డి: BRS Farmer Conference | రాష్ట్రంలో వెయ్యి రోజుల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి రైతులను, ప్రజలను మోసం చేశారని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ (Jajala Surender) విమర్శించారు. కాంగ్రెస్ (Congress) ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్(Yellareddy BRS) ఆధ్వర్యంలో తాడ్వాయి మండల కేంద్రంలో ఆదివారం రైతు సదస్సు-వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు.
BRS Farmer Conference | అవాంఛనీయ సంఘటనలు జరగకుండా..
ఈ కార్యక్రమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జాజాల సురేందర్ మాట్లాడుతూ.. తాడ్వాయి మండలంలో 100 శాతం మంది రైతులు ఆరుతడి పంటలపైనే ఆధారపడి జీవిస్తున్నారని, అందుకే ఇక్కడ రైతు సదస్సు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల సమయంలో రైతు పండించే ప్రతి పంటకు బోనస్ ఇస్తామని సీఎం రేవంత్ మాయమాటలు చెప్పారని ఆరోపించారు. తాడ్వాయిలో ప్రధానంగా మొక్కజొన్న, జొన్న, సోయా, పత్తి పంటలు పండుతాయని, వీటిలో ఒక్క పంటకైనా ప్రభుత్వం బోనస్ ఇచ్చిందా అని ప్రశ్నించారు. కౌలు రైతులకు రూ.15 వేలు, ఉపాధి కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యేపై కూడా జాజాల సురేందర్ విమర్శలు గుప్పించారు.
BRS Farmer Conference | ఎమ్మెల్యేకు కనీస అవగాహన లేదు..
జాతీయ రహదారి మంజూరు ప్రక్రియపై ఎమ్మెల్యేకు కనీస అవగాహన లేదన్నారు. కరీంనగర్ – కామారెడ్డి – ఎల్లారెడ్డి (కేకేవై) రహదారిలో కేవలం 30 కిమీ ఉన్న ఎల్లారెడ్డి నియోజకవర్గానికి జాతీయ రహదారి ఎలా వస్తుందో ఎమ్మెల్యే చెప్పాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ నుంచి సిరిసిల్ల – గొల్లపల్లి వరకు 70 కిమీ, అక్కడ బండి సంజయ్ ఎంపీగా ఉన్నారని, గొల్లపల్లి నుంచి కృష్ణాజివాడి వరకు 50 కిమీ ఉంటుందని, అక్కడ కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారని, కృష్ణాజివాడి నుంచి ఎల్లారెడ్డి వరకు 30-40 కి.మీ ఉంటే ఇక్కడ మదన్ మోహన్ రావు ఎమ్మెల్యేగా ఉన్నట్టు తెలిపారు. కేంద్ర మంత్రులకు ఎంపీలు, మంత్రులు లేఖలు రాస్తేనే పనులు మంజూరవుతాయని, ఎమ్మెల్యేలను పట్టించుకోరనే కనీస సమాచారం కూడా ఎమ్మెల్యేకు లేదని విమర్శించారు.
అందుకే ఇటీవల కేంద్ర మంత్రిని కలిసి జాతీయ రహదారి కోసం వినతి పత్రం ఇచ్చినట్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేకు ప్రపంచ బ్యాంకు సైతం నిధులు ఇస్తుందని, ఏమైనా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారేమోనని సెటైర్లు వేశారు. సోషల్ మీడియా ఉందని ఇష్టం వచ్చినట్లు అవాకులు చవాకులు పేలుతున్నారని, ఎన్ని విమర్శలు చేసినా తాము భయపడబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, సొసైటీ చైర్మన్ కపిల్ రెడ్డి, వివిధ మండలాల అధ్యక్షులు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: కుప్పకూలిన హాస్టల్ బిల్డింగ్