అక్షరటుడే, కామారెడ్డి : Fee Reimbursement Pending | రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందకపోవడం తీవ్ర సమస్యగా మారింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా (Nizamabad District)తో పాటు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 65 డిగ్రీ, పీజీ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో సుమారుగా ఏటా 30 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. అంటే మూడేళ్లుగా 90 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా మారింది. అటు ప్రభుత్వం రీయింబర్స్మెంట్ ఇవ్వక, ఇటు కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వక ఇబ్బందుల్లో ఉన్నారు.
Fee Reimbursement Pending | రూ.300 కోట్లు
ఉమ్మడి జిల్లాలోని కాలేజీలకు దాదాపు రూ.300 కోట్లు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ (Fee Reimbursement) బకాయి ఉంది. దాంతో ప్రైవేట్, ఎయిడెడ్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి నేరుగా ఫీజులు వసూలు చేయడానికి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయమై న్యాయస్థానం సైతం కళాశాలలకు అనుకూలంగా స్టే ఇచ్చింది. ఇప్పటివరకు ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుందనే భరోసాతో ఉన్న విద్యార్థులు ఇప్పుడు ఒక్కసారిగా వేల రూపాయలు కట్టాల్సి వస్తోంది. మొదటి సంవత్సరం నుంచి చివరి సంవత్సరం వరకు బకాయిలు పేరుకుపోవడంతో విద్యార్థులపై భారం పెరుగనుంది.
Fee Reimbursement Pending | నిర్వహణ భారం
కళాశాల యాజమాన్యాలు సైతం బకాయిలు పెండింగులో ఉండటంతో ఇబ్బందుల్లో ఉన్నాయనేది వాస్తవం. ప్రభుత్వం నుంచి నిధులు రాక అధ్యాపకులకు జీతాలు, కళాశాల నిర్వహణ ఖర్చులు భారంగా మారాయని యాజమాన్యాలు వాపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని ప్రైవేట్ డిగ్రీ కళాశాలల సంఘం నేతలు తెలిపారు. పలు దఫాలుగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నప్పటికి నిధులు విడుదల కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
Fee Reimbursement Pending | నిధులు విడుదల చేయాలి

ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఉద్దేశం నెరవేరడం లేదని, విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రైవేట్ కళాశాలల్లో ఫీజులు చెల్లించలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా మారుతుందని, పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారకముందే ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు.
Fee Reimbursement Pending | ఫీజు బకాయిలు తొందరగా విడుదల చేయాలి
– జైపాల్ రెడ్డి, ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల మేనేజ్మెంట్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు
ప్రైవేట్ డిగ్రీ & పీజీ కళాశాలలకు రావాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ప్రభుత్వం తొందరగా విడుదల చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు ఫీజు చెల్లించే పరిస్థితి లేదు. ప్రభుత్వం చెప్పినట్టుగా ఆగస్టు 15 వరకు అంటే విద్యార్థులు వెళ్ళిపోతారు. అప్పుడు విద్యార్థులను ఫీజు అడిగే పరిస్థితి ఉండదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారుగా రూ.300 కోట్ల బకాయిలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. వాటిని ప్రభుత్వం తక్షణమే విడుదల చేస్తే మాకు ఉపశమనం లభిస్తుంది. కోర్టు ఆదేశాలపై ఈ నెల 29 న రాష్ట్రస్థాయిలో సమావేశం ఉంది. ఆ తర్వాత ఎలా ముందుకు వెళ్ళాలనేది రాష్ట్ర నాయకత్వం నిర్ణయిస్తుంది.
ఇది కూడా చదవండి..: SIR Voter Survey | ఎస్ఐఆర్ సర్వేలో ప్రతి ఓటరు తప్పనిసరిగా పాల్గొనాలి: మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల