అక్షరటుడే, కామారెడ్డి: Hotel Food Safety | పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి బిర్యానీ.. హడావిడి జీవితంలో హోటల్ మీద ఆధారపడటం ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. కానీ ఆ కమ్మని రుచి వెనుక మన ఆరోగ్యం ఎంత సురక్షితంగా ఉంది? అనేదే అసలు ప్రశ్న.. కామారెడ్డి జిల్లాలోని పలు హోటళ్లలో(Food Safety Department) కనిపిస్తున్న నిర్లక్ష్యం చూస్తే ఆహారం భద్రమేనా అనే ప్రశ్న తప్పదు.
Hotel Food Safety | కామారెడ్డి పట్టణంలో..
కామారెడ్డి పట్టణంలో(Kamareddy) ఎక్కడ పడితే అక్కడ హోటళ్లు వెలిశాయి. రోడ్లు, కాలనీలు ఇలా చెప్పుకుంటూ పోతే అడుగడుగునా హోటల్స్ దర్శనమిస్తున్నాయి. అయితే ఏ హోటల్ ఎంత భద్రం అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రధాన రహదారులు వెంట ఉన్న హోటళ్లు, దాబాలలో దుమ్ము దూళితో క్రిములు చేరే అవకాశం ఉన్నా పెద్దగా పట్టించుకోవడం లేదన్న ప్రచారం సాగుతోంది.
Hotel Food Safety | అపరిశుభ్రంగా కిచెన్లు
హోటళ్లు ప్రవేశ ద్వారాలు, కస్టమర్లు కూర్చేనే ప్రాంతాలను అందంగా అలంకరిస్తున్న యాజమాన్యాలు కిచెన్‌ను మాత్రం పట్టించుకోవడం లేదు. కిచెన్‌లో జిడ్డు పట్టిన స్లాబులు, బహిరంగంగా పడేసిన చెత్త, శుభ్రంగా లేని గిన్నెలు దర్శనం ఇస్తున్నాయి. కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు తిరుగుతున్నాయి. వంట చేసే సిబ్బంది చేతికి గ్లౌజులు, తలకు కవర్ పెట్టుకోవడం లేదు. అంతేగాకుండా ఒకసారి వేడిచేసిన నూనెను వడగట్టి, మళ్లీ మళ్లీ అదే నూనెతో బజ్జీలు, పూరీలు, చికెన్ ఫ్రైలు చేసేస్తున్నారు. ఆరోగ్య నిపుణుల మాటల్లో చెప్పాలంటే, పదేపదే వేడిచేసిన నూనె విషంతో సమానం. రోజూ కొత్త నూనె కొనడం ఖర్చుతో కూడుకున్న పని అని నిర్వాహకులు చేతులెత్తేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
Hotel Food Safety | ఈగలు, దోమలతో..
కూరలు, స్వీట్లు, కట్ చేసిన పండ్లను మూతలు లేకుండా బయట పెట్టడం.. వాటిపై ఈగలు వాలడం సాధారణమైపోయింది. పలు హోటళ్లలో కిచెన్ కిటికీలకు జాలీలు లేకపోవడంతో దోమలు, బొద్దింకలు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. ఇలాంటి ఆహారం తినడం వల్ల టైఫాయిడ్, కలరా, ఫుడ్ పాయిజనింగ్, అతిసారం లాంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఎక్కువగా ఉంది.
Hotel Food Safety | నోటీసులే.. చర్యల్లేవ్
ఆహార భద్రతా శాఖ అధికారులు అప్పుడప్పుడు సోదాలు నిర్వహించి జరిమానాలు విధించినా(Restaurant Inspection), అవి పేపర్ టైగర్లుగానే మిగిలిపోతున్నాయి. సిబ్బంది కొరత, రాజకీయ ఒత్తిళ్లతో తనిఖీలు నామమాత్రంగా సాగుతున్నాయనే విమర్శలున్నాయి. పట్టుబడిన హోటళ్లకు తాత్కాలిక నోటీసులు ఇవ్వడమే తప్ప, లైసెన్సులు రద్దు చేసిన దాఖలాలు అరుదు. కొద్దిరోజుల క్రితం జిల్లా కేంద్రంలోని రెండు ప్రధాన హోటళ్లలో అధికారులు దాడులు నిర్వహించారు. హోటళ్లలో శుభ్రత లేని మాంసం, కూరగాయలు ఉన్నట్టుగా గుర్తించారు. సంబంధిత హోటళ్లకు నోటీసులు కూడా జారీ చేశారు. ఆ తర్వాత చర్యలు తీసుకోవడం పక్కన పెట్టేశారు.
తనిఖీలు కొనసాగుతున్నాయి
– విక్రమ్, ఫుడ్ ఇన్స్పెక్టర్, కామారెడ్డి
జిల్లాలోని హోటళ్లపై నిరంతరం తనిఖీలు కొనసాగుతున్నాయి. పరిశుభ్రత పాటించని హోటళ్లకు నోటీసులు ఇస్తున్నాం. ఈ నెలలో ఒక హోటల్‌పై కేసు కూడా నమోదు చేశాం. వర్షాకాలం కావడంతో ఖచ్చితంగా ప్రతి హోటల్లో పరిశుభ్రత పాటించాలి. కూరగాయలు, మాంసం ఫ్రెష్‌గా ఉంచాలి. నిల్వ ఉంచి వాడితే ప్రజలు అనారోగ్యానికి గురవుతారు. ఆహార భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు.
Hotel Food Safety, Kamareddy Hotels, Food Hygiene, Food Safety Department, Restaurant Inspection, Public Health, Telangana News, Kamareddy News
ఇది కూడా చదవండి: కేటీఆర్ కన్నెపల్లి పర్యటనను జనగామ జిల్లా కోమల్ల టోల్ గేట్ వద్ద అడ్డుకున్న పోలీసులతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వాగ్వాదం