అక్షరటుడే, ఇందూరు: Syama Prasad Mukherjee | అఖండ భారత నిర్మాణానికి పునాదులు వేసిన గొప్ప దేశభక్తుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు. జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
Syama Prasad Mukherjee | ఆయన జీవితం యువతకు ఆదర్శం
మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మారెడ్డి వనిత అధ్యక్షతన జరిగిన శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దినేష్ కులాచారి (Dinesh Kulachari) మాట్లాడుతూ.. శ్యామా ప్రసాద్ ముఖర్జీ జీవితం యువతకు ఆదర్శమన్నారు. కేవలం 33 ఏళ్ల అతి చిన్న వయసులోనే విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ కావడమే ఆయన మేధస్సుకు నిదర్శనమన్నారు. వయసు చిన్నదైనా, ఆలోచన గొప్పగా ఉంటే ఏ శిఖరాన్నైనా అధిరోహించవచ్చని ఆయన మనకు నిరూపించారని తెలిపారు.
Syama Prasad Mukherjee | ఏక్ దేశ్‌మే ఏక్ హీ ప్రధాన్..
‘ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్, దో నిషాన్ నహీ చలేంగే’ అని గర్జించిన ధీశాలి ఆయన అని దినేష్ అన్నారు. కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తు చేశారు. ‘ఒకే దేశం – ఒకే రాజ్యాంగం – ఒకే ప్రధాని’ అన్న ఆయన ఆశయం, నేడు ఆర్టికల్ 370 రద్దుతో సాకారమైందన్నారు. ఇది ఆయనకు మనం ఇచ్చే నిజమైన ఘన నివాళి అని పేర్కొన్నారు. దేశ విభజనను, పాకిస్తాన్ ఏర్పాటును గట్టిగా వ్యతిరేకించిన ఏకైక గొంతుక ఆయనదని.. బెంగాల్ విభజన జరిగినప్పుడు, పశ్చిమ బెంగాల్‌ను భారత్‌లో భాగంగా ఉంచడంలో ఆయన చూపిన పట్టుదల, పోరాటపటిమ మరువలేనిదని దినేష్ పేర్కొన్నారు. అలాగే, దేశం మొత్తానికి ఒకే విధమైన పౌర స్మృతి (Uniform Civil Code) ఉండాలని ఆయన బలంగా వాదించారన్నారు.
Syama Prasad Mukherjee | స్త్రీ విద్యావంతురాలైతే ఆ కుటుంబం..

స్త్రీ విద్యపై ఆయనకు అపారమైన నమ్మకం ఉండేదని.. ఒక మహిళ విద్యావంతురాలైతే, ఆ కుటుంబమే కాదు, సమాజం మొత్తం అభివృద్ధి చెందుతుందని ఆయన నమ్మేవారని జిల్లాధ్యక్షుడు అన్నారు. ముఖర్జీ గారు చెప్పిన ‘స్వదేశీ’ స్ఫూర్తిని తీసుకుందామని.. స్థానిక వనరులను వాడుకుంటూ, కొత్త ఆవిష్కరణలు చేద్దామన్నారు. క్రమశిక్షణ, దేశభక్తి, నిరంతర అభ్యాసం – ఇవే మీ ఆయుధాలన్నారు. మీరు కేవలం విద్యార్థులు మాత్రమే కాదు, రేపటి భారతదేశాన్ని నిర్మించే శిల్పులని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో గద్దె భూమన్న, పోతన్కర్ లక్ష్మీనారాయణ, నాగోళ్ల లక్ష్మీనారాయణ, ప్రమోద్ కుమార్, నిమ్మల శ్రీనివాస్, రాంచందర్, జ్యోతి, సవిత ఉప్పు, వర లక్ష్మి, వైష్ణవి , బిలోజి నాయక్, బొబ్బిలి వేణు, ఓం సింగ్, పురుషోత్తం, చింత శ్రీనివాస్ రెడ్డి, పుట్ట వీరేందర్, పిల్లి శ్రీకాంత్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Birkur Food Poisoning | గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత