RTC Workers Protest | మంత్రి పొన్నం ప్రభాకర్ రాజీనామా చేయాలి..: కామారెడ్డి ఆర్టీసీ కార్మికుల డిమాండ్

Shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: RTC Workers Protest | రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Transport Minister Ponnam Prabhakar) రాజీనామా చేయాలని కామారెడ్డి ఆర్టీసీ కార్మికులు (RTC strike) డిమాండ్ చేశారు. కార్మికులంతా కలిసి బస్టాండ్ ఎదుట శుక్రవారం ఆందోళన చేపట్టారు. ర్యాలీగా బస్టాండ్​లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. దాంతో అక్కడే నిరసన తెలిపారు.

RTC Workers Protest | బస్టాండ్​ ఎదుట మానవహారం..

బస్టాండ్ ఎదుట సుమారు అరగంటకు పైగా మానవహారం నిర్వహించారు. దాంతో వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడ స్తంభించాయి. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసి మృతి చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. శంకర్ గౌడ్ ఆత్మహత్య ప్రభుత్వ హత్యేనన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే ఆయన మృతికి కారణమని పేర్కొన్నారు. వెంటనే అతని కుటుంబంలో ఒకరికి రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వాలని, కుటుంబానికి రూ.2కోట్ల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. మంత్రి పొన్నం అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తమ డిమాండ్లలో 28 అంశాలు పరిష్కారం చేశామని మీడియా ముందు చెప్పడం సరికాదన్నారు. ఆయన తమ మంత్రి అని చెప్పుకోవడం కూడా ఇష్టం లేదన్నారు.

RTC Workers Protest | ఆర్టీసీని తక్షణమే ప్రభుత్వంలో విలీనం చేయాలి..

ఆర్టీసీని తక్షణమే ప్రభుత్వంలో విలీనం చేయాలన్నారు. ఒక్క కార్మికుడు కూడా నేరుగా తన సమస్యను చెప్పుకోవడానికి డీఎం దగ్గరికి వెళ్లడానికి సాహసించడం లేదని, అందుకే యూనియన్లను అనుమతించాలన్నారు. ఆర్టీసీలో ఉన్న వంద శాతం బస్సులలో 40 శాతం ప్రభుత్వ, 60 శాతం అద్దె బస్సులు ఉన్నాయన్నారు. ఒక వ్యక్తికి వందల, వేలు బస్సులు ఉన్నాయని, అలాంటి వారికే ప్రభుత్వం అవకాశం ఇస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన అంశాలనే అమలు చేయాలని కోరుతున్నామని, ఇతర కోరికలు అడగడం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోను తుంగలో తొక్కవద్దన్నారు. తమలో ఒక డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నప్పటికి సీఎం నోట ఆర్టీసీ మాట రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజాప్రభుత్వం అంటే ఇదేనా..

ప్రజాప్రభుత్వం ఇలాగే ఉంటుందా..? శాంతియుత ఉద్యమాలు చేసుకొనివ్వరా..? అని కార్మికులు ప్రశ్నించారు. కనీసం టెంట్ కూడా వేసుకొనివ్వడం లేదని, వేసిన టెంట్లు తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రలోభాలతో అద్దె బస్సులను నడిపిస్తున్నా తాము అడ్డుకోవడం లేదని గుర్తుచేశారు. ఇవాళ జరుగుతున్న సబ్ కమిటీ సమావేశంలో తీపి వార్త వస్తే సీఎం (Cm Revanth reddy), ఉప ముఖ్యమంత్రి నోటనే చెప్పాలన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నామనే శుభవార్త చెప్పాలని ఆకాంక్షించారు. రెండు పీఆర్సీలు, బకాయిలను విడుదల చేయాలని, ఆర్టీసీలో యూనియన్లను అనుమతించాలని డిమాండ్ చేశారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీ ద్వారా నడపాలన్నారు.

ఔట్​సోర్సింగ్​ విధానాన్ని రద్దు చేయాలి..

ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి ఆర్టీసీలో రిక్రూట్​మెంట్ చేపట్టాలని, హైర్ బస్సు డ్రైవర్లను ఆర్టీసీ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ స్థలాలపై ప్రభుత్వం కన్నేసిందని, హైదరాబాద్ పరిధిలో ఉన్న రూ.1.50 లక్షల కోట్ల ఆర్టీసీ ఆస్తులను హస్తగతం చేసుకునే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఆ తర్వాత జిల్లాల వారీగా ఆర్టీసీ ఆస్తులను హస్తగతం చేసుకునే కుట్ర చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే సమస్యలన్నింటికీ పరిష్కార మార్గమన్నారు. ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెకు బీజేపీ మద్దతు ప్రకటించారు. సమ్మెలో పాల్గొని కార్మికుల సమస్య పరిష్కారమయ్యే వరకు అండగా ఉంటామని చెప్పారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు సైతం సమ్మెలో పాల్గొన్నారు.

122

ఇది కూడా చదవండి : Sachin Birthday | గిరిజన గ్రామంలో సాదాసీదాగా సచిన్ బర్త్‌డే.. పిల్లలతో ఆటలు, క్రీడా మైదానాల నిర్మాణానికి భారీ హామీ

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *