అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad Diesel Buses | హైదరాబాద్ (Hyderabad) నగరాన్ని కాలుష్య రహితంగా మారుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. నగరంలోని డీజిల్ బస్సులను తొలగించి వాటి స్థానంలో విద్యుత్ బస్సులు తెస్తామన్నారు. పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలిస్తామని తెలిపారు. ఆటోలను సైతం విద్యుత్ వాహనాలు మార్చుకునేందుకు చర్యలు చేపడుతామని ప్రకటించారు.
ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ డేటా సెంటర్ కోసం ప్రభుత్వం చందనపల్లిలో మరో 98 ఎకరాలను కేటాయించింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అత్యంత అధునాతన నగరంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నట్లు రెడ్డి తెలిపారు. 2034 నాటికి ఒక ట్రిలియన్, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యం చేరుకుంటామని వెల్లడించారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 10 శాతం ఉండాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. పరిశ్రమలకు సింగిల్ విందో ద్వారా అనుమతులు ఇస్తున్నట్లు వివరించారు.
Hyderabad Diesel Buses | అభివృద్ధి చెందిన రాష్ట్రంగా..
దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణను నిలబెడుతామని సీఎం తెలిపారు. అభివృద్ధిలో తెలంగాణ మోడల్‌ను దేశానికే కాదు, ప్రపంచానికీ చూపించే దిశగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయిలో నివసించే నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. చైనాతో పోటీపడేలా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామన్నారు. హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. దీని కోసమే మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు.
Hyderabad Diesel Buses | కీలక మైలురాయి

అమెజాన్ డేటా సెంటర్‌ను కీలక మైలురాయి ప్రాజెక్టుగా సీఎం అభివర్ణించారు. ఫ్యూచర్ సిటీకి ఇది ప్రధాన బలంగా మారి, ప్రపంచ స్థాయి కంపెనీలు, సరఫరా గొలుసులు, అనుబంధ పరిశ్రమలను ఆకర్షించి తెలంగాణను గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్, ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడానికి, ఉపాధిని కల్పించడానికి ప్రభుత్వం సింగిల్ విండో క్లియరెన్స్‌లు, భూ కేటాయింపులు, పెట్టుబడిదారుల ప్రోత్సాహకాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పిస్తోందన్నారు.
ఇది కూడా చదవండి..: HMDA Chief Engineer | హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ రవీందర్‌కు 14 రోజుల రిమాండ్