అక్షరటుడే వెబ్‌డెస్క్: Indiramma Houses | పేద కుటుంబాలకు గౌరవప్రదమైన సొంతింటిని అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Ponguleti Srinivasa Reddy ) ప్రకటించారు. ఇది కేవలం ఒక విడత కార్యక్రమం మాత్రమే కాదని, అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు అందే వరకు నిరంతరంగా కొనసాగే ప్రక్రియ అని ఆయన స్పష్టం చేశారు.
Indiramma Houses | నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష..
పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఎల్ఐజీ (LIG) ఇళ్ల కార్యక్రమాన్ని సోమవారం సచివాలయంలో ప్రారంభించనున్న నేపథ్యంలో, ఆదివారం మంత్రి ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలు, లబ్ధిదారుల ఎంపిక , దరఖాస్తు ప్రక్రియపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Indiramma Houses | పట్టణ పేదలకూ సొంతింటి భరోసా..
గతంలో కేవలం గ్రామీణ ప్రాంతాలపైనే దృష్టి సారించిన ప్రభుత్వం, ఇప్పుడు హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదల కోసం ‘ఎల్ఐజీ’ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో 2.50 లక్షల ఇళ్లు, పట్టణ ప్రాంతాల్లో లక్ష ఇళ్లు కలిపి మొత్తం 3.50 లక్షల కొత్త ఇళ్లను మంజూరు చేస్తున్నారు. గతేడాది మంజూరు చేసిన 4.50 లక్షల ఇళ్లతో కలిపి మొత్తం 8 లక్షలకు పైగా పేద కుటుంబాలకు సొంతింటి వెలుగులు అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
Indiramma Houses | పారదర్శకంగా దరఖాస్తు ప్రక్రియ..
పథకం అమలులో ఎటువంటి అపోహలకు తావులేకుండా ప్రభుత్వం పారదర్శక విధానాలను అనుసరిస్తోంది. తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి 500 ఇళ్ల చొప్పున నిర్మాణాలను ప్రారంభించనున్నారు. సోమవారం ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి ఇన్చార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, హైదరాబాద్ జిల్లా మంత్రి మహ్మద్‌తో కలిసి ఈ పథకం దరఖాస్తు విధానం, అర్హతలు , బ్రోచర్‌ను అధికారికంగా విడుదల చేయనున్నారు. గత నెలలో ఆసిఫాబాద్‌లో ముఖ్యమంత్రి ప్రారంభించిన రెండో విడత కార్యక్రమం విజయవంతం కావడంతో, ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేస్తున్నామని మంత్రి తెలిపారు.
ఇది కూడా చదవండి: Sridhar Babu | ఎల్‌నినో ముప్పు.. ప్రతి జిల్లాలో కమాండ్ కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు