Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్లకు ‘ఫైనల్​’ బిల్లు తిప్పలు.. ఎదురుచూస్తున్న లబ్ధిదారులు

ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న వారికి ఫైనల్ బిల్లు మంజూరు కాలేదు. దీంతో అప్పులకు వడ్డీ పెరిగిపోతుందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Indiramma Houses | రాష్ట్ర ప్రభుత్వం (State Government) ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు జిల్లాలో శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే పలు ఇళ్ల నిర్మాణాలు పూర్తయి గృహప్రవేశాలు కూడా చేసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చే నిధులకు మరికొన్ని నిధులు సమీకరించుకుని ఇళ్లు కట్టుకునేందుకు లబ్ధిదారులు ముందుకు వస్తున్నారు. అయితే ఇప్పటివరకు కట్టిన ఇళ్లకు ఫైనల్​ బిల్లు కోసం లబ్ధిదారులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

Indiramma Houses | 2,457 ఇళ్లు పూర్తి

జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు 11,609 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 2,457 ఇళ్లు పూర్తికాగా గృహప్రవేశాలు కూడా జరిగిపోయాయి. అయితే ఇళ్లు కట్టుకుని గృహప్రవేశాలు చేసినా చేతికి ఫైనల్ బిల్లు అందక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేసి ఇల్లు నిర్మించుకున్న వారు నిధుల కోసం నానా అవస్థలు పడుతున్నారు. మిగిలిన 9,635 ఇళ్ల పనులు పునాది, లింటల్, రూఫ్ స్థాయిల్లో వివిధ దశల్లో ఉన్నాయి. ఫీల్డ్ స్థాయిలో అధికారులు పర్యవేక్షిస్తున్నామని చెబుతున్నా, నిధుల కొరత కారణంగా పనులు నత్తనడకన సాగుతున్నాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Indiramma Houses | రూ.259.36 కోట్లు ఇప్పటివరకు చెల్లింపు

పూర్తయిన ఇళ్లకు మొదటి రెండు విడతల బిల్లులను ప్రభుత్వం క్లియర్ చేసింది. ఇప్పటివరకు విడతల వారీగా రూ.259.36 కోట్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఉపాధి హామీ, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల వాటా నిధులు కూడా దశలవారీగా అందుతాయని వివరించారు. మొదటి రెండు విడతల బిల్లుల విడుదలలో పెద్దగా ఇబ్బంది లేదు. అసలు సమస్య ఫైనల్ విడత చెల్లింపుతోనే మొదలైంది. ఇల్లు పూర్తయినా చివరి విడత నగదు చేతికి అందకపోవడంతో చాలామంది అప్పులు తీర్చలేని పరిస్థితి. ‘ఇల్లు కట్టేశాం. సిమెంట్, ఇనుము కోసం తెచ్చిన అప్పులకు వడ్డీ పెరిగిపోతోంది. ఫైనల్ బిల్లు ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు’ అని లబ్ధిదారులు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు విడుదలయ్యాయని అధికారులు చెబుతున్నా, కేంద్రం నుంచి నిధులు రాకపోవడంతో ప్రక్రియ నిలిచిపోయిందని తెలుస్తోంది.

Indiramma Houses | కేంద్రం, రాష్ట్రం కలిపి రూ.1.20 లక్షలు..

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి చివరి విడతలో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.1.20 లక్షల ఆర్థిక సాయం అందిస్తాయి. ఇందులో కేంద్రం వాటా రూ.72 వేలు, రాష్ట్రం వాటా రూ.48వేలు ఉంటుంది. దీనికి అదనంగా ఉపాధి హామీ పథకం కింద రూ.27వేలు, మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12వేలు చెల్లిస్తారు. చివరి దశలో కేంద్రం వాటా నిధులు ఆలస్యం కావడంతో లబ్ధిదారులకు నష్టం వాటిల్లుతోంది.

Indiramma Houses | పెండింగ్ ఇళ్ల పనులపై ప్రభావం..

ఫైనల్ బిల్లులు ఆలస్యం కావడంతో ఇప్పటికే పనులు ప్రారంభించిన 9,635 మంది లబ్ధిదారులు కూడా నిధులు లేక నిర్మాణాలను నిలిపివేస్తున్నారు. ఇటుక, ఇసుక, కూలీలకు డబ్బులు ఇవ్వలేక పనులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. దీంతో పథకం లక్ష్యం గాడితప్పే ప్రమాదం ఉంది. పూర్తయిన ఇళ్లకు ఫైనల్ బిల్లులు వెంటనే అందితే మిగతా లబ్ధిదారుల్లో నమ్మకం పెరిగి పనులు వేగవంతమయ్యే అవకాశం ఉంది.

Indiramma Houses | కేంద్రం నిధులు రావాలి

-విజయపాల్ రెడ్డి, హౌసింగ్ పీడీ, కామారెడ్డి

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మొదటి విడతలో 11,609 ఇళ్లకు గాను 2,457 ఇళ్లు పూర్తయ్యాయి. ఇప్పటికే రూ.259.36 కోట్లు లబ్ధిదారులకు చెల్లించాం. రెండవ విడతలో 1,356 ఇళ్లు మంజూరయ్యాయి. బిల్లుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే  ఇల్లు పూర్తయిన వారికి  రూ.3.41 లక్షల చొప్పున చెల్లించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.1.20 లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో రాష్ట్ర వాటా రూ.48 వేలు చెల్లించాల్సి ఉండగా కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉండడంతో ఫైనల్ బిల్లుల ప్రక్రియ పెండింగ్‌లో ఉంది.

ఇది కూడా చదవండి..: Illegal Sand Transport | ఇసుక అక్రమ రవాణాపై గ్రామస్తుల ఆగ్రహం.. ట్రాక్టర్ల అడ్డగింత

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *