Nerella Incident Apology | నేరెళ్ల ఘటనపై ప్రజలకు క్షమాపణ చెప్పిన కవిత

సిరిసిల్ల నియోజకవర్గం నేరెళ్లలో బాధితులను తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nerella Incident Apology | సిరిసిల్ల నియోజకవర్గం నేరెళ్లలో బాధితులను తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) పరామర్శించారు. బీఆర్​ఎస్​ (BRS) తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక లారీలను అడ్డుకున్నారని నేరేళ్ల దళితులపై పోలీసులు థర్డ్​ డిగ్రీ ప్రయోగించారు. వారిని కవిత పరామర్శించారు.

నేరెళ్లలో జరిగిన ఘటన సభ్య సమాజం తలదించుకోవాల్సిన ఘటన అని కవిత పేర్కొన్నారు. ఆ సమయంలో పరిపాలించిన కుటుంబంలో తాను సభ్యురాలు కావడంతో క్షమించమని కోరారు. తెలంగాణ వచ్చిందంటే అందరు బాగుండాలని అనుకున్నామన్నారు. కానీ కొందరి ధనదాహం కోసం నేరేళ్లలో దాడి జరిగిందన్నారు. నాడు ఇసుక లారీలతో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోతే గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారన్నారు. ఆ సమయంలో పోలీసులు వారిపై దాష్టికం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 8 మంది దళితులను తీసుకెళ్లి 5 రోజుల పాటు వారిని విపరీతంగా కొట్టారన్నారు. అప్పుడు దళితులను కొట్టిన పోలీసులకు ఇప్పటి వరకు శిక్ష పడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Nerella Incident Apology | న్యాయం జరగలేదు

ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకున్నారా అని కవిత ప్రశ్నించారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్​ ఎందుకు శ్రద్ధ చూపలేదన్నారు. గతంలో బండి సంజయ్ (Bandi Sanjay)​ వచ్చి పరామర్శించారని, ఇంతవరకు ఎలాంటి చర్యలు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. ఈ ఘటనలో ఎస్సైని బలి పశువును చేసి మిగతా వారిని తప్పించారిని ఆరోపించారు. 9 ఏళ్లు గడుస్తున్నా.. ఇంకా దళితులకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్​రెడ్డి అధికారంలోకి వచ్చి 30 నెలలు అవుతున్న నేరెళ్ల గురించి మాట్లాడలేదన్నారు. ఈ ఘటనకు పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ఆ రోజు పోలీసుల చేతిలో దెబ్బతిన్న వారు ఇంకా కోలుకోలేదన్నారు. బాధితులకు ప్రభుత్వం రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

Nerella Incident Apology | అసలు ఏం జరిగిందంటే..

రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్ల గ్రామంలో 2017 జూన్​లో ఇసుక లారీ ఢీకొని ఓ వ్యక్తి చనిపోయాడు. దీంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. లారీలను అడ్డుకొని నిప్పు పెట్టారు. దీంతో పోలీసులు పలువురు దళితులను అదుపులోకి తీసుకొని థర్డ్​ డిగ్రీ ప్రయోగించారు. ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఘటన జరిగి 9 ఏళ్లు అవుతున్నా.. బాధితులు ఇంకా గాయాల నుంచి కోలుకోలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కాగా అప్పటి అధికార పార్టీ నాయకుల ఇసుక దందా కావడంతో పోలీసులు దళితులను కొట్టారని ఆరోపణలు వచ్చాయి. అయితే కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చినా.. ఈ ఘటనపై చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలో కవిత బాధితులను పరామర్శించారు.

దీనిని కూడా చదవండి : Supreme Court | నీట్​ నిరసనల్లో పోలీసుల తీరుపై విచారణ అవసరం: సుప్రీంకోర్టు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *