Sriram Sagar Project | ఎస్సారెస్పీలో పూడికపై కేంద్రంతో చర్చిస్తున్నాం..: మంత్రి ఉత్తమ్​ కుమార్​రెడ్డి

ఎస్సారెస్పీలో ఇసుక పూడికపై కేంద్రంతో చర్చిస్తున్నామని మంత్రి ఉత్తమ్​ కుమార్​రెడ్డి తెలిపారు. మంత్రులు శ్రీధర్​బాబు, వివేక్​తో కలిసి శ్రీరాంసాగర్​ ప్రాజెక్టును సందర్శించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బాల్కొండ(మెండోరా): Sriram Sagar Project | ఎస్సారెస్పీలో ఇసుక పూడికపై కేంద్రంతో చర్చిస్తున్నామని మంత్రి ఉత్తమ్​ కుమార్​రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఎల్లంపల్లి, మేడిగడ్డ, అన్నారం సుందిళ్ల ప్రాజెక్టులపై కాంగ్రెస్​ పార్టీకి ఎలాంటి దురుద్దేశం లేదని ఆయన పేర్కొన్నారు. మెండోరా మండలం (Mendora Mandal)లోని శ్రీరాంసాగర్​ ప్రాజెక్టును మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్​బాబు, వివేక్​తో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

Sriram Sagar Project | బీఆర్​ఎస్​ తప్పుడు ప్రచారం

ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లో ప్రస్తుతం నీటినిల్వలను స్వయంగా పరిశీలించేందుకు వచ్చామని.. వీటి ఆధారంగా రాష్ట్రంలో రైతాంగానికి సాగుకు నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. నేషనల్​ డ్యామ్​ సేఫ్టీ అథారిటీ, సెంట్రల్​ వాటర్​ కమిషన్​ టెక్నికల్​ ఓవర్​సీస్​ కమిటీ సూచనల మేరకు ప్రాజెక్టుల పునరుద్ధరణ పనులు చేస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రాజెక్టులపై చేపడుతున్న విధానాలపై బీఆర్​ఎస్ ​పార్టీ పూర్తిగా తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ఈ ఏడాది కూడా మేడిగడ్డ, అన్నారం సుందిళ్ల బ్యారేజీలు.. వాటి పంప్​హౌస్​లు ఉపయోగించకుండానే వర్షం కారణంగా ఎల్లంపల్లి రిజర్వాయర్​ 20టీఎంసీలు నిండడం జరిగిందన్నారు. కానీ తాము ప్రాజెక్టులపై తప్పులు చేస్తున్నట్లుగా బీఆర్​ఎస్​ ప్రచారం చేస్తోందని విమర్శించారు. శుక్రవారం ఢిల్లీలో నేషనల్​ డ్యామ్​ సేఫ్టీ అథారిటీ, సెంట్రల్​ వాటర్​ కమిషన్​ టెక్నికల్​ ఓవర్​సీస్​ కమిటీ కూర్చుని తెలంగాణలో ప్రాజెక్టులపై తీసుకుంటున్న నిర్ణయాలను సమర్థించాయన్నారు. కాంగ్రెస్​ హయాంలో కట్టిన ఎస్సారెస్పీ, నాగార్జున సాగర్​, శ్రీశైలం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంటే.. 2019లో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు 2026లో కూలిపోయిందన్నారు.

Sriram Sagar Project | 56ఏళ్లుగా ఎస్సారెస్పీ సేవలు..

1970 నుంచి ఎస్సారెస్పీ పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభించిందని.. అప్పటినుంచి ఈరోజు వరకు 56ఏళ్లుగా నిరంతరాయంగా ఎస్సారెస్పీ ప్రజలకు సేవలందిస్తోందన్నారు. అయితే 112 టీఎంసీలతో కెపాసిటీతో నిర్మించిన ఈ రిజర్వాయర్ ప్రస్తుతం ఇసుక చేరడం కారణంగా 80 టీఎంసీల స్టోరేజీకి పడిపోయిందని తెలిపారు. తిరిగి పూర్తిస్థాయి స్టోరేజీకి ప్రాజెక్టును మలిచేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని.. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది శ్రీరాంసాగర్​లో నీళ్లు తక్కువగా 22 టీఎంసీలు మాత్రమే ఉన్నాయన్నారు. ఈ నీటిని భవిష్యత్తు సాగు అవసరాలకు ఎలా వినియోగించుకోవాలనే విషయంపై త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్​ ఇన్​ఛార్జి కలెక్టర్​ భావేష్​, డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, ఉర్దూ అకాడమీ ఛైర్మన్​ తాహెర్​బిన్​ హందాన్​, కాంగ్రెస్​నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Nizamabad Oora Panduga | ఊరంతా మెచ్చే ‘ఊర పండుగ’కు సర్వంసిద్ధం..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *