అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana Nominated Posts | తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీపై కాంగ్రెస్ Congress పార్టీ కసరత్తు వేగవంతం చేసింది. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న సీనియర్ నాయకులకు ప్రాధాన్యం కల్పించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటుండటంతో ఆశావహుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. జిల్లా, నియోజకవర్గ స్థాయిలో విస్తృత సంప్రదింపులు నిర్వహించి తుది జాబితాను ఖరారు చేయాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి సమావేశమయ్యారు.
సమావేశంలో రానున్న వ్యవసాయ పరపతి సహకార సంఘాల (PACS) ఛైర్మన్లు, డైరెక్టర్లు, అలాగే నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవుల భర్తీపై విధివిధానాలపై చర్చించారు.
Telangana Nominated Posts | 60 శాతం పదవులు సీనియర్లకే..
సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాల ప్రకారం, మొత్తం నామినేటెడ్ పదవుల్లో 60 శాతం పార్టీ కోసం దీర్ఘకాలంగా పనిచేసిన నాయకులకు కేటాయించాలని నిర్ణయించారు. ముఖ్యంగా మాజీ మండల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు, నియోజకవర్గ స్థాయి సీనియర్ నేతలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
Telangana Nominated Posts | జిల్లాల వారీగా సంప్రదింపులు
ఉమ్మడి జిల్లాలకు బాధ్యత వహిస్తున్న ఇన్‌ఛార్జి మంత్రులు, ఆయా జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, సీనియర్ నాయకులతో సమావేశాలు నిర్వహించి ఆశావహుల పేర్లను సమన్వయంతో సిద్ధం చేయాలని నిర్ణయించారు. అనంతరం రూపొందిన నివేదికను రాష్ట్ర నాయకత్వానికి అందజేయనున్నారు.
Telangana Nominated Posts | సామాజిక సమతుల్యతకు ప్రాధాన్యం
నియామకాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు తగిన ప్రాధాన్యం కల్పించాలని సమావేశంలో స్పష్టం చేశారు. సామాజిక సమతుల్యతతో పాటు పార్టీకి సేవలందించిన వారికి న్యాయం జరిగేలా ఎంపిక ప్రక్రియ ఉండాలని నాయకత్వం భావిస్తోంది.
తుది నిర్ణయం సీఎం, పీసీసీ అధ్యక్షుడిదే
జిల్లాల నుంచి వచ్చే నివేదికలు, సంప్రదింపులు పూర్తయిన తర్వాత తుది జాబితాను సిద్ధం చేసి, ముఖ్యమంత్రి మరియు టీపీసీసీ అధ్యక్షుడు కలిసి నామినేటెడ్ పదవులపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమావేశంలో నిర్ణయించారు.
ఆశావహుల్లో ఉత్కంఠ
రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది కాంగ్రెస్ నాయకులు నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. పార్టీ అధికారం చేపట్టిన తర్వాత తొలి విడతలోనే పదవులు వస్తాయని ఆశించిన నేతలు, ఇప్పుడు పార్టీ రూపొందించిన కొత్త మార్గదర్శకాలతో మరింత ఆశాభావంతో ఉన్నారు.
సీనియర్లకు ప్రాధాన్యం ఇవ్వాలన్న నిర్ణయం పార్టీ అంతర్గత రాజకీయాల్లో కీలక చర్చకు దారితీస్తుండగా, తుది జాబితాలో ఎవరికి అవకాశం దక్కుతుందనే అంశం ఆసక్తికరంగా మారింది.