అక్షరటుడే వెబ్‌డెస్క్: Mahesh Kumar Goud | క్షుద్ర పూజల అంశంపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ( Harish Rao )మరోసారి బహిరంగంగా వివరణ ఇవ్వాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమకు మూఢనమ్మకాలు లేవని, కానీ మార్చి 2న తిరుచ్చిలో, జూన్ 1న శివమెగ్గలో హరీశ్ రావు ఏ ఉద్దేశంతో పూజలు చేశారో ప్రజలకు చెప్పాలన్నారు. తాను హరీశ్ రావును ఎక్కడా కించపరచలేదని, ఆయన వెళ్లిన ఆలయాలు క్షుద్రపూజలకు ప్రసిద్ధి చెందడం వల్లే ఆ ప్రశ్న అడిగానని స్పష్టం చేశారు. ఈ రాష్ట్రానికి ఎవరు శనో, ఎవరు దరిద్రమో ప్రజలు ఇప్పటికే ఎన్నికల్లో తేల్చేశారని విమర్శించారు. హరీశ్ రావు పంపిన లీగల్ నోటీసులకు తాము భయపడేది లేదని, అందులో ఎలాంటి న్యాయపరమైన అంశాలున్నా కోర్టులోనే ఎదుర్కొంటామని తేల్చిచెప్పారు.
Mahesh Kumar Goud | కీలక విషయాలపై చర్చలు..
ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్‌లపై కోఆర్డినేషన్ కమిటీలో చర్చిస్తే మంచి నిర్ణయాలు తీసుకోవచ్చని భావించామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. అయితే, కమిటీ సమావేశంలో ప్రతి చిన్న విషయాన్ని ముఖ్యమంత్రికి తెలపాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తాము సీఎం రేవంత్ రెడ్డిని గౌరవిస్తామని, పార్టీ, ప్రభుత్వం వేర్వేరు కాదని చెప్పారు. కోఆర్డినేషన్ కమిటీలో చాలా ఓపెన్‌గా కీలక విషయాలపై చర్చలు జరిగాయని అన్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో టేబుల్ ఓవెల్ షేప్‌లో ఉండటం వల్ల వంశీ మధ్యలో కూర్చున్నట్లు కనిపిస్తోందని, ప్రొటోకాల్ ప్రకారం మీనాక్షీ నటరాజన్ సమీక్ష నిర్వహించారని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో తనకు మంచి సఖ్యత ఉందని, ఇద్దరి మధ్య ఎలాంటి గ్యాప్ లేదని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో దొంగచాటుగా ఫిర్యాదులు చేసుకునే సంస్కృతి లేదని, ఏ విషయమైనా ఒకరి మొహంపైనే మరొకరు నేరుగా మాట్లాడుకుంటామని వెల్లడించారు. తాము రోజూ ఫోన్‍లో మాట్లాడుకుంటామని, నిన్న కూడా సీఎం తో ఫోన్ మాట్లాడినట్లు తెలిపారు.
Mahesh Kumar Goud | ప్రతిపక్షాలకు కౌంటర్..
తన వద్ద ఆడియోలు, వీడియోలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ.. దమ్ముంటే ఆ ఆడియోలు, వీడియోలను బయటపెట్టాలని మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. బీజేపీ నేతలు ధర్మపురి అర్వింద్, బండి సంజయ్ వ్యాఖ్యలు కేవలం నీటిమూటలేనని కొట్టిపారేశారు. ప్రతిపక్ష నేతలు తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. దేశానికి ఎంతో సేవ చేసిన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కూడా తక్కువ ఎత్తు ఉన్నప్పటికీ దేశాన్ని విజయవంతంగా పాలించలేదా అని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: MLA Prakash Goud | కొడుకుపై దాడి చేయించిన ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్!