Bonalu Funds Telangana | బోనాల ఉత్సవాలకు తక్కువ నిధులా? రాష్ట్ర ప్రభుత్వంపై బండి సంజయ్ ఫైర్

బోనాల ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులపై కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Bonalu Funds Telangana | బోనాల ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులపై కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ ( Bandi Sanjay )తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హిందూ సమాజం, సనాతన ధర్మం విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సంతుష్టీకరణ రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. బీజేపీ మాత్రం సంతుష్టీకరణ రాజకీయాలకు పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో వేలాది ఆలయాలు ఉన్నప్పటికీ బోనాల ఉత్సవాలకు కేటాయిస్తున్న నిధులపై ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్ చేశారు. ఇతర పండుగలకు కేటాయించే నిధులతో పోలిస్తే బోనాలకు ఎందుకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రశ్నించారు.

Bonalu Funds Telangana | చరిత్ర వక్రీకరణపై ప్రశ్నలు..

తెలంగాణ సాయుధ పోరాట యోధుల చరిత్రను పాఠ్యాంశాల్లో ఎందుకు చేర్చలేదని బండి సంజయ్ నిలదీశారు. చరిత్రను వాస్తవ కోణంలో భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. టిప్పుసుల్తాన్ అంశాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ వైఖరిపై విమర్శలు గుప్పించారు. అయోధ్య రామమందిర నిర్మాణాన్ని కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించడంపై కూడా ప్రశ్నలు సంధించారు. హిందూ సమాజానికి సంబంధించిన సమస్యలను ప్రశ్నిస్తే వాటికి మతం రంగు పులమడం సరికాదన్నారు. ఆలయాల పరిరక్షణ, గోరక్షణ, హిందువుల భద్రత వంటి అంశాలపై తాను నిరంతరం మాట్లాడుతానని స్పష్టం చేశారు. సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. బోనాలకు ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని, బీజేపీ ప్రజా సమస్యలపై పోరాడే రాజకీయ పార్టీ అని పేర్కొన్నారు.

Bonalu Funds Telangana | హామీలపై నిలదీత..

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని బండి సంజయ్ ఆరోపించారు. హైడ్రాలో కేవలం 150 పోస్టుల భర్తీకి నిర్వహించిన ఫిజికల్ టెస్ట్‌కు సరూర్‌నగర్ స్టేడియం యువతతో కిక్కిరిసిపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కాంగ్రెస్ హామీ ఏమైందని ప్రశ్నించారు. ఉద్యోగాలు భర్తీ చేసే వరకు నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి ఇస్తామన్న హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రోజ్‌గార్ మేళాల ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగ నియామకాలు చేపట్టిందని గుర్తుచేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే బకాయిలను విడుదల చేసి పేద విద్యార్థులకు అండగా నిలవాలని కోరారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500 చెల్లిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. వృద్ధాప్య పింఛన్లను రూ.4 వేలకు పెంచుతామని చెప్పి ఎందుకు అమలు చేయడం లేదని, అర్హులైన వృద్ధుల నుంచి దరఖాస్తులు ఎందుకు స్వీకరించడం లేదని నిలదీశారు. అభివృద్ధి, ఉద్యోగాలు, సంక్షేమ పథకాల అమలుపై ప్రశ్నిస్తే మతం రంగు పులమడం మానుకోవాలని, ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి:  NALSAR CJI Controversy | నల్సార్‌లో సీజేఐ ఆహ్వానంపై రగడ.. యాజమాన్యానికి విద్యార్థుల లేఖ 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *