Nagarjuna Sagar | నాగార్జున సాగర్​ నీటి విడుదల.. ఏపీ, తెలంగాణ మధ్య వివాదం

నాగార్జున సాగర్​ నుంచి నీటి విడుదల విషయంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్​ మధ్య మరోసారి వివాదం నెలకొంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nagarjuna Sagar | నాగార్జున సాగర్​ నుంచి నీటి విడుదల విషయంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్​ మధ్య మరోసారి వివాదం నెలకొంది. సాగర్ కుడి కాలువ నుంచి ఏపీ అధికారులు తాగునీటి విడుదల చేపట్టారు. దీనిపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది.

సాగర్ నుంచి కుడి కాలువ ద్వారా ఏపీ అధికారులు బుధవారం 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కేఆర్​ఎంబీ (KRMB) నుంచి అనుమతులు లేకుండానే నీటి విడుదల చేపట్టడంపై తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా ఏపీ అధికారులు పట్టించుకోకపోవడంతో ఎడమ కాలువకు కూడా తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు నీటిని విడుదల చేశారు. 500 క్యూసెక్కులు వదులుతున్నారు. దీంతో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య వివాదం రాజుకుంది. కృష్ణా నది (Krishna River)పై గల నాగార్జున సాగర్​ నిర్వాహణను తెలంగాణ అధికారులు, శ్రీశైలం డ్యామ్​ నిర్వాహణను ఏపీ అధికారులు చూస్తున్న విషయం తెలిసిందే.

Nagarjuna Sagar | నిండకముందే..

ఈ ఏడాది ఎల్​నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిశాయి. వానాకాలం సీజన్​ మరో నెల రోజులు మాత్రమే ఉంది. అయినా కూడా నాగార్జున సాగర్​ (Nagarjuna Sagar)కు భారీగా వరద రావడం లేదు. ఎగువన కర్ణాటకలో కురిసిన వర్షాలతో కృష్ణానదికి వరద వచ్చింది. దీంతో జూరాల ప్రాజెక్టు నిండింది. శ్రీశైలం జలాశయానికి సైతం భారీగా వరద వచ్చింది. దీంతో విద్యుత్​ ఉత్పత్తి ప్రారంభించడంతో నాగార్జున సాగర్​కు వరద వచ్చింది. అయితే ఇంకా శ్రీశైలం ప్రాజెక్ట్​ సైతం నిండలేదు. మరోవైపు సాగర్​ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 180 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాగర్​ నిండాలంటే భారీగా వరద రావాల్సి ఉంది. ప్రస్తుతం జలాశయంలో 21,241 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. అయితే ప్రాజెక్ట్​ నిండకముందే అధికారులు కేఆర్​ఎంబీ అనుమతులు లేకుండా నీటి విడుదల చేపట్టడం గమనార్హం.

దీనిని కూడా చదవండి : Konda Murali | కాంగ్రెస్​ను వీడేది లేదు.. కొండా మురళి కీలక వ్యాఖ్యలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *