Singareni Medical Board | సింగరేణి ఉద్యోగులకు గుడ్​న్యూస్​.. త్వరలో సింగరేణి మెడికల్ బోర్డు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్‌: Singareni Medical Board | డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) సింగరేణి ఉద్యోగులకు గుడ్​ న్యూస్​ చెప్పారు. త్వరలో మెడికల్​ బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మెడికల్ బోర్డును అత్యంత పారదర్శకంగా, వివాదరహితంగా నిర్వహించాలని సూచించారు.

సింగరేణి కార్మికుల సమస్యలపై డిప్యూటీ సీఎం భట్టి శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మెడికల్ బోర్డును అతి త్వరలో ప్రారంభించాలని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. మెడికల్ బోర్డు ప్రక్రియ ద్వారా నిజంగా అర్హులైన ఉద్యోగులకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని, వారి వారసులకు కారుణ్య నియామకాల రూపంలో ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు, అవకతవకలు, మధ్యవర్తిత్వం లేదా మోసాలకు తావులేకుండా కట్టుదిట్టమైన వ్యవస్థను అమలు చేయాలని స్పష్టం చేశారు.

Singareni Medical Board | కారుణ్య నియమాకాలు

Singareni Medical Board

కారుణ్య నియామకాలు, డిపెండెంట్ ఉద్యోగాలకు అర్హత సాధించిన 335 మంది వారసులకు మంచిర్యాలలో శనివారం జరిగే కార్యక్రమంలో ఉద్యోగ నియామక పత్రాలను అందజేయనున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. తమ ప్రభుత్వం సింగరేణిలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన వివరించారు. కారుణ్య నియామకాల కోసం ఉన్న గరిష్ట వయోపరిమితిని 35 ఏళ్ల నుంచి 40 సంవత్సరాలకు పెంచామన్నారు.

Singareni Medical Board | రూ.1.25 కోట్ల ప్రమాద బీమా

దేశంలోనే తొలిసారిగా సింగరేణిలో పనిచేస్తున్న 40 వేల మంది ఉద్యోగులకు రూ.1.25 కోట్ల ప్రమాద బీమా (Accident Insurance) సదుపాయాన్ని కల్పించామని భట్టి విక్రమార్క తెలిపారు. బ్యాంకులతో సంప్రదింపులు జరిపి ఇటీవలే సింగరేణి ఉద్యోగుల కోసం రూ.10 లక్షల ఉచిత సహజ బీమా సదుపాయాన్ని కూడా కల్పించామన్నారు. కాంట్రాక్టు కార్మికులకు కూడా 40 లక్షల ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పించినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో సింగరేణిని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

ఇది కూడా చదవండి..: Kavitha Criticism | కమిటీల పేరుతో కాలయాపన.. ప్రభుత్వంపై కవిత విమర్శలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *