Thummidihatti Barrage | తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ పునరుద్ధరణ దిశగా అడుగులు.. సెప్టెంబర్ 1న కేంద్రం కీలక భేటీ!

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణంపై నెలకొన్న అడ్డంకులను తొలగించేందుకు కేంద్రం రంగంలోకి దిగింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Thummidihatti Barrage | తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణంపై నెలకొన్న అడ్డంకులను తొలగించేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. ఢిల్లీలోని సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) అధ్యక్షతన సెప్టెంబర్ 1న ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ కీలక అంతరాష్ట్ర భేటీకి సంబంధించి తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం అధికారిక ఆహ్వానాలు పంపింది. ఢిల్లీలో జరగనున్న ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నీటిపారుదల శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు హాజరై.. బ్యారేజీ ఎత్తు, సాంకేతిక అంశాలు, ముంపు ప్రాంతాలు, ఇతర జల వివాదాలపై సమగ్రంగా చర్చించనున్నారు.

Thummidihatti Barrage | రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ..

తుమ్మిడిహట్టి బ్యారేజీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy )మొదటి నుంచి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. మహారాష్ట్ర అభ్యంతరాలు, బ్యారేజీ ఎత్తుపై సమగ్ర చర్చలు జరిపి, కేంద్రం మధ్యవర్తిత్వం వహించాలని కోరుతూ ఆయన ఇటీవల సీడబ్ల్యూసీకి లేఖ రాశారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్రం.. రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఈ భేటీని ఖరారు చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణ ప్రాంతాల సాగునీటి అవసరాలు తీర్చే ఈ ప్రాజెక్టు సమస్యకు ఈ సమావేశంతో పరిష్కారం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.

Thummidihatti Barrage | మహారాష్ట్ర అభ్యంతరాలు..

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత నదిపై ఈ బ్యారేజీని నిర్మించాలని తలపెట్టారు. ఉమ్మడి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్‌లో భాగంగా మొదట 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించాలని ప్లాన్ చేశారు. అయితే ఈ ఎత్తు వల్ల తమ రాష్ట్రంలో భారీగా భూములు మునిగిపోతాయని మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఎత్తును 148 మీటర్లకు తగ్గించాలని కోరింది. తమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తే ఎలాంటి లిఫ్ట్‌లు లేకుండా, తక్కువ విద్యుత్ ఖర్చుతో గ్రావిటీ ద్వారానే మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ నియోజకవర్గాల్లోని లక్షలాది ఎకరాలకు సాగునీరు అందనుంది. దీంతో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ అంతరాష్ట్ర జల వివాదం సెప్టెంబర్ 1 భేటీతో తొలగిపోతుందని ఉత్తర తెలంగాణ రైతాంగం ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది.

ఇది కూడా చదవండి:  Nepal Floods | నేపాల్‌లో భీకర జలప్రళయం.. గల్లంతైన కేంద్ర మాజీ మంత్రి కోడలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *