అక్షరటుడే వెబ్‌డెస్క్: Revanth Reddy Vote Removal | ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందే లక్ష్యంతో కేంద్రంలోని బీజేపీ ( BJP )ప్రభుత్వం ఓట్ల తొలగింపు వ్యూహాలకు తెరలేపిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కొడంగల్‌లోని తన నివాసంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి ప్రజలు తనను గుండెల్లో పెట్టుకుని ఆదరించడం వల్లే జాతీయ స్థాయిలో కొడంగల్‌కు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, ఆ ప్రజల అభిమానమే తనకు కొండంత బలమని ఆయన స్పష్టం చేశారు.
Revanth Reddy Vote Removal | ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లే టార్గెట్..
ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ పేరుతో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మహారాష్ట్ర, బీహార్, బెంగాల్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీ ఇదే రకమైన వ్యూహాన్ని అమలు చేసి గెలుపొందిందని, ఇప్పుడు అదే పద్ధతిలో తెలంగాణలోనూ దొంగదెబ్బ తీయాలని చూస్తోందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న దుర్బుద్ధితోనే ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన ఓట్లను లక్ష్యంగా చేసుకున్నారని ధ్వజమెత్తారు. గతంలో రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికి ఈడీ, సీబీఐలను అస్త్రాలుగా వాడిన వారు.. ఇప్పుడు నేరుగా ఓట్లను గల్లంతు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే ఈ కుట్రలో బీజేపీకి ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కూడా మద్దతు ఇస్తూ సహకరిస్తోందని మండి పడ్డారు. రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు కలిసి పన్నుతున్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
Revanth Reddy Vote Removal | కార్యకర్తలే ఓట్ల రక్షకులు..
ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును పకడ్బందీగా కాపాడుకోవాలని, ప్రజల ఓట్లను కాపాడాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తల భుజస్కంధాలపైనే ఉందని సీఎం స్పష్టం చేశారు. గ్రామాల వారీగా బూత్ లెవెల్ ఏజెంట్లను (BLA) సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రతి నాలుగు గ్రామాలకు ఒక నాయకుడిని బాధ్యతను పర్యవేక్షించేలా నియమించాలని, ప్రతి పోలింగ్ బూత్లోనూ ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
ఇది కూడా చదవండి: Vijay TVK Alliance | కూటమిలో చేరికలపై క్లారిటీ వచ్చేనా?.. విజయ్ కీలక సమావేశంపై సర్వత్రా ఆసక్తి