KTR Comments | క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ వార్నింగ్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి, పోలీసుల తీరుపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో తీవ్రంగా మండిపడ్డారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: KTR Comments | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి, పోలీసుల తీరుపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో తీవ్రంగా మండిపడ్డారు. సభలో తాము ఎలాంటి అసభ్య పదాలు ఉపయోగించలేదని, రాహుల్ గాంధీ తరహాలోనే టీ-షర్టులు వేసుకుని ప్రజాస్వామ్యద్ధంగా నిరసన తెలిపామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఎంత రెచ్చగొట్టినా సంయమనం పాటించాలని కేసీఆర్ తమకు స్పష్టంగా సూచించారని, కానీ రేవంత్ రెడ్డి  ( Revanth Reddy )తన పోలీసు బలగంతో కలిసి అత్యంత కిరాతకంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు.

KTR Comments | మహిళా నేతల పట్ల అమానుషం..

సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి వంటి సీనియర్ మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులపై జరిగిన ఈ దాడుల వెనుక ముమ్మాటికీ సీఎం రేవంత్ రెడ్డి హస్తమే ఉందని ఆరోపించారు. టీ-షర్టులపై అభ్యంతరకర పదాలు ఉన్నాయనడానికి డీసీపీ శిల్పవల్లి ఎవరని ప్రశ్నించారు. ఏ నిబంధన ప్రకారం తమను అడ్డుకున్నారో చెప్పకుండా, రేవంత్ రెడ్డిని నిలదీస్తున్నారనే కక్షతోనే ఈ అడ్డంకులు సృష్టించారని విమర్శించారు. ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మరల్చేందుకే ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరలేపిందని, అసెంబ్లీని కాస్తా దుశ్శాసన సభగా మార్చేశారని దుయ్యబట్టారు.

KTR Comments | క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టం..

స్పీకర్ స్థానంలో ఉండి వివక్ష చూపించడం తగదని, సీఎంను విమర్శిస్తే మైక్ ఇవ్వబోమనడం సరికాదని కేటీఆర్ హితవు పలికారు. గలాటాకు అసలు కారకుడైన ముఖ్యమంత్రి.. నిరసనకారులకు, మహిళా నేతలకు క్షమాపణ చెప్పే వరకు సభలో నిలదీస్తామని తేల్చిచెప్పారు. గతంలో తాము డి.కె. అరుణకు క్షమాపణ చెప్పిన విషయాన్ని, తాతా మధు విషయంలోనూ కేసీఆర్ వెంటనే స్పందించి విచారం వ్యక్తం చేయాలని ఆదేశించిన వైనాన్ని గుర్తుచేశారు. దళితులపై నిజంగా ప్రేమ ఉంటే ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై చర్చ పెట్టాలని సవాల్ విసిరారు.

KTR Comments | అవిశ్వాస హెచ్చరిక..

సభలో ఇష్టానుసారంగా మాట్లాడే రేవంత్ రెడ్డి తమకు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడికి నిరసనగా తాము బీఏసీ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఘటనపై గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయడానికి అపాయింట్‌మెంట్ కోరామని, రాష్ట్రంలో కాంగ్రెస్-బీజేపీ కుమ్మక్కై రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. స్పీకర్ గనుక పక్షపాతంగా వ్యవహరిస్తూ పోతే, అవసరమైతే ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి:  IT Sector Selloff | ఐటీ సెక్టార్‌లో అమ్మకాల ఒత్తిడి.. నష్టాలతో ముగిసిన ప్రధాన సూచీలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *