అక్షరటుడే వెబ్డెస్క్: Harish Rao Comments | శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం ముమ్మాటికీ ప్రజా సమస్యల గొంతు నొక్కడమేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై ఆయన ‘ఎక్స్’ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ( Revanth Redd )ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ కాదని, ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ అని ఆయన విమర్శించారు. తమ సమస్యలపై అసెంబ్లీలో గళం విప్పాలని ప్రజలు కోరుకుంటుంటే.. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ప్రజల గొంతుకైన బీఆర్ఎస్ సభ్యులను బయటకు పంపడమే పనిగా పెట్టుకున్నారని హరీశ్ రావు నిప్పులు చెరిగారు.
Harish Rao Comments | తిరుగుబాటు తప్పదు..
పాలనలో ప్రజాస్వామ్య విలువలను పూర్తిగా తుంగలో తొక్కి కాంగ్రెస్ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని హరీశ్ రావు మండిపడ్డారు. పాలకులలో నియంతృత్వ పోకడలు ఎంత పెరిగితే, ప్రజల నుంచి వచ్చే తిరుగుబాటు కూడా అంతకంటే రెట్టింపు స్థాయిలో ఉంటుందనే చారిత్రక సత్యాన్ని సీఎం రేవంత్ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీస్తున్న ప్రతిపక్షాల గొంతును సస్పెన్షన్లతో అణచివేయాలని చూడటం అవివేకమని, రాబోయే రోజుల్లో ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని ఆయన స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Talasani Srinivas Yadav | సభలో లేనివారిని సస్పెండ్ చేశారు : తలసాని