అక్షరటుడే వెబ్‌డెస్క్: Bandi Sanjay Comments | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఆ పార్టీ ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా గెలుచుకునే పరిస్థితి లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. భద్రాచలంలో జరిగిన బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఉమ్మడి ఖమ్మం ( Khammam )జిల్లాలో ముగ్గురు పవర్ ఫుల్ మంత్రులు ఉన్నప్పటికీ, జిల్లా అభివృద్ధి కోసం వారు సాధించింది గుండు సున్నా అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. మంత్రుల మధ్య అంతర్గత కుమ్ములాటలు, సీఎం కుర్చీ కోసం తాపత్రయమే తప్ప ప్రజల సంక్షేమం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. హామీల అమలులో పూర్తిగా విఫలమైన ఆ ముగ్గురు మంత్రులు రాజీనామా చేసే వరకు బీజేపీ శ్రేణులు పోరాటాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణతో పాటు కర్ణాటక వంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ త్వరలో బీజేపీ జెండా పాతడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Bandi Sanjay Comments | ప్రజా సమస్యలను గాలికి..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.6 లక్షల కోట్ల అప్పు చేస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 32 నెలల కాలంలోనే రూ.3 లక్షల కోట్ల అప్పు చేసిందని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ హయాంలో కుటుంబ దోపిడీ జరిగితే, నేడు కాంగ్రెస్ పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేలు కౌంటర్లు తెరిచి భూములు, నిధులను దోచుకుంటున్నారని విమర్శించారు. 22-ఏ నిషేధిత జాబితా పేరుతో కోటి ఎకరాల భూమిని చేర్చి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు డ్రామాలు ఆడుతూ అసలు ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నాయని మండిపడ్డారు.
Bandi Sanjay Comments | కేంద్ర నిధులతోనే గ్రామాల అభివృద్ధి..
గ్రామాల్లో జరుగుతున్న ప్రతీ అభివృద్ధి పనికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వమే నిధులు ఇస్తోందని బండి సంజయ్ స్పష్టం చేశారు. కానీ కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు పక్కదారి పట్టిస్తోందని విమర్శించారు. పంచాయతీలకు వస్తున్న ఆర్థిక సంఘం నిధులను కరెంట్ బిల్లులు, జీతాలకే సరిచేయడమే దీనికి నిదర్శనమన్నారు.
ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కేంద్రం అందించిన నిధుల వివరాలను ఆయన వెల్లడించారు.భద్రాద్రి కొత్తగూడెంలో ఏడు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) ఏర్పాటుతో పాటు, పాల్వంచ ఇండస్ట్రియల్ పార్క్ అప్‌గ్రేడేషన్ కోసం కేంద్రం రూ.8 కోట్ల గ్రాంటును మంజూరు చేసిందని బండి సంజయ్ వెల్లడించారు. అలాగే, ఖమ్మంలో గ్రీన్‌ఫీల్డ్ హైవే 5 ప్యాకేజీల కింద దాదాపు రూ.4,000 కోట్లు, ఎన్‌హెచ్-365ఏ (కోదాడ–ఖమ్మం–కావూరి రోడ్డు) నిర్మాణానికి రూ.446 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు కేంద్రం సానుకూలంగా ఉందని పేర్కొన్న ఆయన, ఏపీలో విలీనమైన ముంపు గ్రామాల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Bandi Sanjay Comments | భయపడాల్సిన అవసరం లేదు..
తమిళనాడులో నటుడు విజయ్ తరహాలోనే తెలంగాణలోనూ బీజేపీకి అనుకూల వాతావరణం సృష్టిస్తామని బండి సంజయ్ చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని స్థానాల్లో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని, కేసులకు భయపడాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. అమిత్ షా సభకు లక్షలాదిగా తరలివచ్చిన జనమే ఖమ్మంలో పార్టీ బలానికి నిదర్శనమని, గ్రూపు తగాదాలు పక్కనపెట్టి అందరూ సమష్టిగా పనిచేస్తే అద్భుతాలు సాధించవచ్చని పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: BRS Public Apology | స్పీకర్‌కు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి