Nepal Airlines Map | తప్పుడు మ్యాప్‌ వివాదం.. తలవంచిన నేపాల్ ఎయిర్‌లైన్స్!

Balla Sandeep Kumar

అక్షరటుడే, న్యూదిల్లీ: Nepal Airlines Map | భారత భూభాగమైన జమ్మూకశ్మీర్‌ను తప్పుగా చూపించిన వ్యవహారంలో నేపాల్ ఎయిర్‌లైన్స్ ఎట్టకేలకు దిగివచ్చింది. భారత సార్వభౌమాధికారానికి భంగం కలిగించేలా ఉన్న మ్యాప్‌ను సోషల్ మీడియా (Social Media)లో పోస్ట్ చేసినందుకు గాను భారత్‌కు బహిరంగ క్షమాపణలు తెలియజేసింది.

Nepal Airlines Map | అసలేం జరిగిందంటే?

నేపాల్ ఎయిర్‌లైన్స్ (Nepal Airlines) బుధవారం తన నెట్‌వర్క్ మ్యాప్‌ను సోషల్ మీడియాలో పంచుకుంది. అయితే, ఈ మ్యాప్‌లో భారత కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లను పాకిస్థాన్ భూభాగంలో ఉన్నట్లుగా చూపించింది. ఈ పోస్ట్ కాస్తా వైరల్ కావడంతో భారత నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ సరిహద్దులను కించపరిచేలా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘బాయ్‌కాట్ నేపాల్ ఎయిర్‌లైన్స్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు.

Nepal Airlines Map | దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలని..

నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. భోజ్‌పురి నటుడు ఖేసరిలాల్ యాదవ్ ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ.. ఇది ఉద్దేశపూర్వకంగా చేసినట్లు ఉందని విమర్శించారు. భారత విదేశాంగ శాఖ, విమానయాన మంత్రిత్వ శాఖలు వెంటనే స్పందించి నేపాల్‌పై దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు.

Nepal Airlines Map | నష్ట నివారణ చర్యలు

పరిస్థితి తీవ్రతను గమనించిన నేపాల్ ఎయిర్‌లైన్స్ వెంటనే అప్రమత్తమైంది. వివాదాస్పద పోస్ట్‌ను తొలగించడమే కాకుండా, అంతర్జాతీయ సరిహద్దుల గుర్తింపులో పొరపాటు జరిగిందని అంగీకరించింది. జరిగిన తప్పిదానికి భారత్‌కు క్షమాపణలు చెబుతూ, దీనిపై అంతర్గత విచారణ చేపడుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ వివాదంపై భారత విదేశాంగ శాఖ అధికారికంగా ఇంకా స్పందించాల్సి ఉంది.

ఇది కూడా చదవండి..: Rajnath Singh | ఉగ్రవాదంపై రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *