MMTS Free Travel | హైదరాబాదీల‌కు గుడ్ న్యూస్.. ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణం ఎప్పటి నుంచో తెలుసా?

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: MMTS Free Travel | హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు ప్రజలపై రవాణా భారాన్ని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలోని MMTS రైళ్లలో మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ప్రక్రియ తుది దశకు చేరుకుంది.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 నుంచి ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా ఏడాది పాటు అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ పథకం అమలుకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే సూచనల మేరకు అవసరమైన నిబంధనలతో కూడిన ముసాయిదా ఒప్పందాన్ని అధికారులు సిద్ధం చేశారు.

MMTS Free Travel | అద‌నపు రైళ్ల‌ని న‌డిపేలా..

రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ సాంకేతిక, ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఒప్పందాన్ని రూపొందించారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదన న్యాయశాఖ, ఆర్థికశాఖ, సీఎంవో పరిశీలనలో ఉంది. అక్కడి నుంచి ఆమోదం లభించిన వెంటనే తుది నిర్ణయం కోసం రైల్వే బోర్డుకు పంపించనున్నారు. ప్రస్తుతం ఎంఎంటీఎస్ సేవల ద్వారా రైల్వే శాఖ (Railway Department)కు ఏడాదికి సుమారు రూ.10 కోట్ల ఆదాయం వస్తోంది. ఉచిత ప్రయాణం అమల్లోకి వస్తే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. అయితే రైల్వేకు వచ్చే ఈ ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తామని హామీ ఇచ్చింది. కొవిడ్‌కు Covid ముందు రోజుకు సుమారు 1.20 లక్షల మంది ప్రయాణించిన ఎంఎంటీఎస్‌లో ప్రస్తుతం ఆ సంఖ్య 40 వేల వరకు పడిపోయింది. కొత్త నిర్ణయంతో ఈ సంఖ్య మళ్లీ పెరిగే అవకాశముంది.

MMTS Free Travel | రద్దీ సమయాల్లో..

ఎంఎంటీఎస్ సేవలను (MMTS services) మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రద్దీ సమయాల్లో అదనపు రైళ్లను నడిపేలా రైల్వే బోర్డును కోరింది. ప్రయాణికులకు ‘లాస్ట్ మైల్ కనెక్టివిటీ’ అందించేందుకు ఆర్టీసీ షటిల్ బస్సులను కూడా నడపాలని యోచిస్తోంది. స్టేషన్లలో సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు బస్సుల పార్కింగ్ కోసం రైల్వే ప్రాంగణాల్లో స్థలం కేటాయించాలని ప్రతిపాదించింది. ఇదిలా ఉంటే, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ‘మహాలక్ష్మి’ పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. ఇప్పుడు ఎంఎంటీఎస్‌లో కూడా అందరికీ ఫ్రీ ట్రావెల్ అందిస్తే, హైదరాబాద్ Hyderabad ప్రజలకు ఇది పెద్ద ఊరటనివ్వనుంది. ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు కాలుష్యం కూడా గణనీయంగా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Hyderabad Fire Accident | హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆకాశాన్ని అంటేలా ఎగిసిపడిన మంటలు!

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *