అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Wage Irregularities | కామారెడ్డి (Kamareddy) మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికులకు చెల్లించే వేతనాల్లో ప్రతినెలా రూ.లక్షల్లో అవకతవకలు జరుగుతున్నాయని బీజేపీ (BJP Kamareddy) కౌన్సిలర్లు ఆరోపించారు. ఈ మేరకు బీజేపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
Kamareddy Wage Irregularities | పారిశుధ్య పనులకు కూడా దిక్కులేదు..
బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మోటూరీ శ్రీకాంత్ మాట్లాడుతూ.. పట్టణంలో నూతన పాలకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి అభివృద్ధి పనులు పక్కనపెడితే కనీసం వార్డుల్లో పారిశుధ్య సమస్యలు కూడా పరిష్కారం కావడం లేదని, గత 8 నెలలుగా అన్ని పార్టీల కౌన్సిలర్లు సర్వసభ్య సమావేశాల్లో విన్నవించినా పురోగతి లేదన్నారు. గత వారం ఉదయం హాజరు సమయంలో బీజేపీ కౌన్సిలర్ల బృందం పరిశీలనకు వెళ్లగా, అక్కడ పనిచేసే సిబ్బందికి హాజరు పట్టికలో నమోదైన సంఖ్యకు పొంతన లేదని, జీతాల చెల్లింపులో అవకతవకలు జరుగుతున్నట్లు గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. పారిశుధ్య కార్మికులకు వేతనాలు చెల్లించే 35 గ్రూపులకు మున్సిపల్ నుంచి చెల్లించిన మొత్తానికి, కార్మికులకు అందుతున్న వేతనాలకు మధ్య భారీ వ్యత్యాసం ఉందని, కార్మికులను నేరుగా కలిసి వివరాలు తెలుసుకోగా ఈ విషయం బయటపడిందని తెలిపారు.
Kamareddy Wage Irregularities | పూర్తిస్థాయి శానిటేషన్ ఇన్స్పెక్టర్ లేకపోవడంతో..
వేతనాలు చెల్లించే గ్రూపుల్లో లేని వారికి చెక్ పవర్ ఉండటం, చెక్ పవర్ ఉన్నవారు చేతివాటం ప్రదర్శించడం, వేతనాలు ఇచ్చే సమయంలో కోతలు విధించడం అనేక అనుమానాలకు తావిస్తోందని ఫ్లోర్‌లీడర్ తెలిపారు. పూర్తిస్థాయి శానిటేషన్ ఇన్స్పెక్టర్ లేకపోవడం, ఇన్‌ఛార్జీలతో నెట్టుకొస్తుండటం వల్లే ఈ అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇదే పరిస్థితి వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ, కార్యాలయ సిబ్బంది వేతనాల చెల్లింపులోనూ ఉందని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని కలెక్టర్, ఎమ్మెల్యేలకు వినతిపత్రం అందజేస్తామన్నారు. నిజాలు నిగ్గు తేలాల్సిన అవసరం ఉందని, ప్రతినెలా రూ.లక్షల్లో ప్రజాధనం దారి మళ్లుతుంటే బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సుజిత, వంశీ, నరేందర్ రెడ్డి, భానుప్రకాశ్, అరవింద్, ప్రీతి జైన్, అరవింద్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: రెపో రేటు పెంపుపై ఆర్బీఐ కీలక నిర్ణయం..?