Police Martyrs Day | పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి : కలెక్టర్​, సీపీ

పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్య అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Police Martyrs Day | శాంతి భద్రతల పరిరక్షణ కోసం అహర్నిశం శ్రమిస్తూ అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్య అన్నారు. పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Police Martyrs Day | అమరవీరుల స్థూపం వద్ద నివాళులు

పోలీస్ కమిషనర్ సాయి చైతన్యతో కలిసి కలెక్టర్​ (Collector Ila Tripathi) పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాలు సమర్పించి నివాళులర్పించారు. విధి నిర్వహణలో భాగంగా సంఘ విద్రోహశక్తులతో పోరాడుతూ, అమరులైన పోలీసులను స్మరించుకోవడం, వారి కుటుంబాల త్యాగాలను గుర్తించడం ప్రతిఒక్కరి కనీస బాధ్యత అని గుర్తుచేశారు.  శాంతిభద్రతల పరిరక్షణ విధుల్లో పోలీసులు అనునిత్యం నిమగ్నమై ఉంటారని అన్నారు. ఈ క్రమంలో ఎదురయ్యే అనేక సవాళ్లను తమ ప్రాణాలను పణంగా పెట్టి ధైర్యంగా ఎదుర్కొంటారన్నారు. ఈ నేపథ్యంలోనే గతేడాది జిల్లాకేంద్రంలో అసాంఘిక శక్తుల చేతిలో ప్రమోద్ కుమార్ అనే సీసీఎస్ కానిస్టేబుల్ వీర మరణం పొందారని గుర్తు చేశారు. పోలీసు అమరుల కుటుంబాలకు ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

Police Martyrs Day | దేశవ్యాప్తంగా 154మంది పోలీసులు..

పోలీస్ కమిషనర్ సాయిచైతన్య మాట్లాడుతూ, ఈ ఏడాది దేశవ్యాప్తంగా 154 మంది పోలీసులు అమరులయ్యారని అన్నారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో 1986 నుండి ఇప్పటివరకు 21 మంది పోలీసులు అసాంఘిక శక్తులతో పోరాడుతూ అసువులు బాశారని పేర్కన్నారు. శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా తమ కర్తవ్య నిర్వహణలో ఎల్లవేళలా పోలీసులు ముందంజలో నిలుస్తున్నారని అన్నారు. అమరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లవేళలా చేదోడువాదోడుగా ఉంటుందని భరోసా కల్పించారు. ఇప్పటికే 11 మందికి ఇంటిస్థలాలు కేటాయించామని, మిగతా పది కుటుంబాలకు వారు కోరిన మేరకు కామారెడ్డి, మాక్లుర్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో స్థలాలు కేటాయించేలా రెవెన్యూ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. అమరుల కుటుంబాలు తమ సాధకబాధకాలు తెలియజేసేందుకు వరుసలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా కమిషనరేట్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక అధికారిని నియమిస్తామని తెలిపారు. జిల్లాలో విధి నిర్వహణలో అమరులైన పోలీసుల కుటుంబీకులకు జ్ఞాపికలు అందజేశారు. అదనపు డీసీపీ శుభం నగ్రాలే, ఏసీపీ (ఏఆర్) కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: SRSP Water Release | రైతులకు అలర్ట్​.. ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదల నిలిపివేత

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *