అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PAANI App | ఎల్‌నినో ప్రభావంతో హైదరాబాద్ (Hyderabad) నగరంలో రానున్న రోజుల్లో తాగునీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉంది. ఈ క్రమంలో జలమండలి (HMWSSB) అధికారులు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నీటి వృథా, దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ పానీ యాప్‌ను ప్రారంభించారు.
నీటి సంరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని ఆయన అన్నారు. నీటి పొదుపును ప్రజా ఉద్యమంగా మార్చాలని సూచించారు. ఖైరతాబాద్‌లోని జలమండలి కార్యాలయంలో నీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు రూపొందించిన ‘PAANI’ యాప్‌ను ఆయన ప్రారంభించారు. నీటి వృథాను అరికట్టేందుకు ప్రజల భాగస్వామ్యం అవసరం అని చెప్పారు. జరిమానాలు విధించడం ప్రభుత్వ లక్ష్యం కాదని, ప్రజల్లో అవగాహన, బాధ్యత పెంచడం కోసమే ఫైన్లు వేస్తున్నట్లు తెలిపారు.
PAANI App | వలంటీర్‌గా మారాలి
పాత్రికేయులు, ఉద్యోగులు, యువత, స్వచ్ఛంద సంస్థలు, కాలనీ సంక్షేమ సంఘాల సభ్యులతో పాటు ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ వాటర్ వలంటీర్లుగా నమోదు చేసుకోవాలని మంత్రి కోరారు. తమ పరిసరాల్లో తాగునీటి వృథా, దుర్వినియోగాన్ని గుర్తిస్తే PAANI యాప్ ద్వారా అధికారులకు సమాచారం అందించాలన్నారు. చురుగ్గా పనిచేసే వలంటీర్లను ప్రోత్సహిస్తామని ఆయన తెలిపారు. విస్తరిస్తున్న నగర అవసరాలకు అనుగుణంగా గోదావరి ఫేజ్-2, 3 ప్రాజెక్టుల ద్వారా అదనపు జలాలను సమకూర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.
PAANI App | వేసవిలో తాగునీటికి సవాళ్లు
జలమండలి ఎండీ అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. సింగూరు–మంజీరా జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గాయని తెలిపారు. దీంతో వేసవిలో తాగునీటి సరఫరాకు సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు తగ్గడంతో ఇప్పుడే ట్యాంకర్ల డిమాండ్ పెరుగుతోందని తెలిపారు. రానున్న రోజుల్లో తీవ్రత మరింత ఎక్కువ అవుతుందని హెచ్చరించారు. ప్రతి కుటుంబం కనీసం 20 శాతం నీటిని పొదుపు చేయాలని ఆయన కోరారు.
దీనిని కూడా చదవండి : KTR on Drought | రాష్ట్రంలో కరువుకు సీఎం కారణం : కేటీఆర్