Madhav Nagar ROB | మాధవ్ నగర్ ఆర్‌వోబీకి అదనపు నిధులు మంజూరు.. ఎంపీ అర్వింద్ హర్షం

మాధవ్ నగర్ ఆర్​వోబీ నిర్మాణానికి ప్రభుత్వం రూ.101.80 కోట్లతో సవరించిన పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.

Srinivas Kolluri

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Madhav Nagar ROB | జిల్లావాసులు ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) నిర్మాణానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు వరుసల ఆర్‌వోబీ నిర్మాణానికి రూ.101.80 కోట్లతో సవరించిన పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది.

మాధవ్​నగర్​ వద్ద ఆర్​వోబీ పనులు మధ్యలో నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ​ గతంలో రూ.93.12 కోట్లుగా ఉన్న ప్రాజెక్టు వ్యయాన్ని రూ.101.80 కోట్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రెండేళ్లుగా అదనపు నిధుల మంజూరు, సవరించిన అంచనాలకు సంబంధించిన పరిపాలనా అనుమతులు పెండింగ్‌లో ఉండటంతో నిర్మాణ పనులు ఆశించిన వేగంతో ముందుకు సాగలేదు.

Madhav Nagar ROB | ఎంపీ అర్వింద్​ కృషి

ఆర్వోబీ నిర్మాణం కోసం.. ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Dharmapuri Arvind) పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి, సంబంధిత మంత్రులకు విజ్ఞప్తులు చేశారు. గతంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కూడా కలిసి అదనపు నిధుల అవసరాన్ని వివరించారు. స్పందించిన కోమటిరెడ్డి ఫైల్ ని క్లియర్ చేసి ఆర్థిక శాఖకి పంపారు. అక్కడ ఫైల్ క్లియర్ కాకపోవడంతో ప్రజల ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు అక్టోబర్ 27న మాధవ్ నగర్ ఆర్‌ఓబీ వద్ద ఎంపీ అర్వింద్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. నిధులు మంజూరు చేయాలని, ఎంపీ స్వయంగా భిక్షాటన చేపట్టారు.

Madhav Nagar ROB | మంత్రులకు ధన్యవాదాలు

అనంతరం అక్టోబర్ 29న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి మాధవ్ నగర్ ఆర్‌ఓబీకి సంబంధించిన రూ.8.68 కోట్ల అదనపు నిధులకు ఆర్థిక, పరిపాలనా అనుమతులు మంజూరు చేయాలని ఎంపీ అర్వింద్ విజ్ఞప్తి చేశారు. ఎంపీ కృషితో ప్రభుత్వం సోమవారం అదనపు నిధుల మంజూరుకు పరిపాలన అనుమతులు జారీ చేసింది. నిధుల మంజూరుపై ఎంపీ హర్షం వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. మాధవ్ నగర్ ఆర్‌ఓబీ పూర్తయితే నగరంతో పాటు డిచ్‌పల్లి, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు గణనీయంగా తగ్గుతాయన్నారు. సంబంధిత శాఖల అధికారులు ఇకపై ఎలాంటి జాప్యం లేకుండా పనులను వేగవంతం చేయాలని కోరారు.

ఇది కూడా చదవండి..: Jawahar Navodaya Campus  | జవహర్ నవోదయ క్యాంపస్ పనులను వేగంగా పూర్తిచేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *