అక్షరటుడే, కామారెడ్డి : Alternative Crops for Farmers | యాసంగి సీజన్లో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) ఆదేశించారు. కలెక్టరేట్లో వ్యవసాయ, నీటిపారుదల, ఉద్యానవన తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Alternative Crops for Farmers | తక్కువ నీటితో..
నీటి వనరులు పరిమితంగా ఉన్నందున తక్కువ నీటితో అధిక దిగుబడి, ఆదాయం పొందగలిగే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. పెసర, మినుములు, కందులు వంటి పప్పుధాన్యాలు, వేరుశనగ, నువ్వులు వంటి నూనెగింజలు, జొన్న, సజ్జ, మొక్కజొన్న వంటి చిరుధాన్యాలు, కూరగాయల సాగును ప్రోత్సహించాలని సూచించారు. గ్రామ, మండల స్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించి పంట మార్పిడి వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించాలన్నారు. తహశీల్దార్లు, ఎంపీడీఓలు, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, పంచాయతీ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ క్షేత్రస్థాయిలో రైతులకు సరైన మార్గదర్శనం చేయాలని ఆదేశించారు.
Alternative Crops for Farmers | బాధ్యతాయుతంగా..
ప్రతి అధికారి రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మళ్లించడంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఆయిల్ పామ్, కూరగాయల వంటి ఉద్యానవన పంటల సాగుతో తక్కువ నీటిని వినియోగిస్తూ మెరుగైన ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ విక్టర్, వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రెడ్డి, ఉద్యాన శాఖ అధికారిని జ్యోతి, గిరిజన శాఖ అధికారి సౌజన్య, డీఆర్డీవో దామోదర్ రెడ్డి పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Madhavnagar ROB Approvals | కాంగ్రెస్ కృషితోనే మాధవ్నగర్ ఆర్వోబీకి పరిపాలన అనుమతులు..