Money Doubling Scam | మంత్రాలతో డబ్బులు రెట్టింపు చేస్తామని మోసం

మంత్రాలు, క్షుద్ర పూజలతో డబ్బులు రెట్టింపు చేస్తామని మోసాలకు పాల్పడుతున్న ముఠాను ఆదిలాబాద్​ పోలీసులు అరెస్ట్​ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Money Doubling Scam | ఇంధ్ర సినిమాలో నీటిలో వేస్తే నగలు రెట్టింపు అవుతాయని నమ్మించి బ్రహ్మానందం అండ్​ కో ఏవీఎస్​ను మోసం చేసిన సీన్​ అందరికి గుర్తుండే ఉంటుంది. అచ్చంగా అలాంటి మోసమే ఆదిలాబాద్​ జిల్లా (Adilabad District)లో చోటు చేసుకుంది. మంత్రాలు, క్షుద్ర పూజలతో డబ్బులు రెట్టింపు చేస్తామని చెప్పి, మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్​ చేశారు.

ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్​ మహాజన్​ సోమవారం కేసు వివరాలు వెల్లడించారు. అత్రం పర్శురామ్ (40), మండలి బక్కన్న (47), నౌగాడే శేఖర్ (39), మండలి శైలేష్ (27) మరియు షేక్ అలీమ్ (36) అనే ఐదుగురు నిందితులను ఇచ్చోడ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా బాధితుల నుంచి లక్షలాది రూపాయలను వసూలు చేసి, ఆ సొమ్మును విలాసాలకు, కార్ల ఈఎంఐల చెల్లింపులకు, అలాగే ఇళ్ల నిర్మాణానికి ఉపయోగించుకున్నట్లు గుర్తించారు.

Money Doubling Scam | మాయమాటలు చెప్పి..

తోకల రాజు అనే వ్యక్తి తనకు పరిచయం ఉన్న శ్రీపతి రాజుతో కలిసి వారం క్రితం ఆదిలాబాద్​ వచ్చాడు. ఆ సమయంలో బస్టాండ్​ వద్ద నిందితులు వారిని కలిశారు. పూజలు చేస్తే డబ్బులు రెట్టింపు అవుతాయని నమ్మించారు. నవంబర్ 19 సాయంత్రం ఇచ్చోడ మండలంలోని జాతీయ రహదారి-44 పక్కన టీజీడబ్ల్యూఆర్జేసీ పాఠశాల సమీపంలోని అండర్ బ్రిడ్జ్ వద్ద వారి డబ్బులు రెట్టింపు చేస్తామని చెప్పి మోసం చేశారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు.

Money Doubling Scam | గతంలో సైతం..

ఈ కేసులో అత్రం పర్శురామ్ ప్రధాన నిందితుడు. ఈ ముఠా గతంలో మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్, ఆసిఫాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కూడా ప్రజలను మోసం చేసినట్లు గుర్తించారు. వారి నుంచి రూ. 3,74,000 నగదు, మూడు కార్లు, నాలుగు ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్​ జిల్లాలో ఈ ముఠాపై మొత్తం ఎనిమిది కేసులు నమోదయ్యాయి.

ఇది కూడా చదవండి..: Chain Snatching Gang | వాంతులు చేసుకున్నట్లు నటించి.. చైన్​ స్నాచింగ్​కు పాల్పడుతున్న ముఠా

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *