అక్షరటుడే, వెబ్‌డెస్క్: Money Doubling Scam | ఇంధ్ర సినిమాలో నీటిలో వేస్తే నగలు రెట్టింపు అవుతాయని నమ్మించి బ్రహ్మానందం అండ్ కో ఏవీఎస్‌ను మోసం చేసిన సీన్ అందరికి గుర్తుండే ఉంటుంది. అచ్చంగా అలాంటి మోసమే ఆదిలాబాద్ జిల్లా (Adilabad District)లో చోటు చేసుకుంది. మంత్రాలు, క్షుద్ర పూజలతో డబ్బులు రెట్టింపు చేస్తామని చెప్పి, మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం కేసు వివరాలు వెల్లడించారు. అత్రం పర్శురామ్ (40), మండలి బక్కన్న (47), నౌగాడే శేఖర్ (39), మండలి శైలేష్ (27) మరియు షేక్ అలీమ్ (36) అనే ఐదుగురు నిందితులను ఇచ్చోడ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా బాధితుల నుంచి లక్షలాది రూపాయలను వసూలు చేసి, ఆ సొమ్మును విలాసాలకు, కార్ల ఈఎంఐల చెల్లింపులకు, అలాగే ఇళ్ల నిర్మాణానికి ఉపయోగించుకున్నట్లు గుర్తించారు.
Money Doubling Scam | మాయమాటలు చెప్పి..
తోకల రాజు అనే వ్యక్తి తనకు పరిచయం ఉన్న శ్రీపతి రాజుతో కలిసి వారం క్రితం ఆదిలాబాద్ వచ్చాడు. ఆ సమయంలో బస్టాండ్ వద్ద నిందితులు వారిని కలిశారు. పూజలు చేస్తే డబ్బులు రెట్టింపు అవుతాయని నమ్మించారు. నవంబర్ 19 సాయంత్రం ఇచ్చోడ మండలంలోని జాతీయ రహదారి-44 పక్కన టీజీడబ్ల్యూఆర్‌జేసీ పాఠశాల సమీపంలోని అండర్ బ్రిడ్జ్ వద్ద వారి డబ్బులు రెట్టింపు చేస్తామని చెప్పి మోసం చేశారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు.
Money Doubling Scam | గతంలో సైతం..
ఈ కేసులో అత్రం పర్శురామ్ ప్రధాన నిందితుడు. ఈ ముఠా గతంలో మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్, ఆసిఫాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కూడా ప్రజలను మోసం చేసినట్లు గుర్తించారు. వారి నుంచి రూ. 3,74,000 నగదు, మూడు కార్లు, నాలుగు ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఈ ముఠాపై మొత్తం ఎనిమిది కేసులు నమోదయ్యాయి.
ఇది కూడా చదవండి..: Chain Snatching Gang | వాంతులు చేసుకున్నట్లు నటించి.. చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ముఠా