అక్షరటుడే, రాజన్న సిరిసిల్ల : Bandhankal Road Accident |ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. రాజన్న సిరిసిల్ల జిల్లా (Sircilla) ముస్తాబాద్ మండలం వెంకయ్యకుంట–బంధనకల్ గ్రామాల శివారులో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
Bandhankal Road Accident | బైక్..వ్యాన్ ఢీ..
బైక్‌పై వెళ్తున్న బంధనకల్ గ్రామానికి చెందిన కస్తూరి మహేందర్‌రెడ్డి అలియాస్ మణికుమార్‌రెడ్డి, భరత్‌లను ఎదురుగా వచ్చిన వ్యాన్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మణికుమార్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన భరత్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో భరత్ మృతి చెందాడు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృత్యువాత పడటంతో బంధనకల్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి.
Bandhankal Road Accident | కేసీఆర్ దిగ్భ్రాంతి..
మణికుమార్‌రెడ్డి మృతిపై బీ ఆర్ ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముస్తాబాద్ మాజీ ఎంపీపీ జనగామ శరత్‌రావుతో ఫోన్‌లో మాట్లాడి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Bandhankal Road Accident | ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ:
ప్రమాద స్థలాన్ని జిల్లా ఎస్పీ మహేశ్ బి. గితే మంగళవారం పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు, రహదారి పరిస్థితులు, ఇతర సాంకేతిక అంశాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణమైన వ్యాన్‌ను సీజ్ చేసి, డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద కారణాలపై అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేపట్టి, త్వరితగతిన పూర్తి నివేదిక అందించాలని డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ నాగేశ్వరరావు, ఎస్ఐ జ్యోతిలను ఎస్పీ ఆదేశించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. అతివేగం, మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. చలికాలం కావడంతో పొగమంచు కారణంగా రహదారి సరిగా కనిపించదని, ముందు వెళ్లే వాహనాలకు తగినంత దూరం పాటిస్తూ జాగ్రత్తగా ప్రయాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ నాగేశ్వరరావు, ఎస్ఐ జ్యోతి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Siddhula Gutta | సిద్ధుల గుట్టపై 1వ శతాబ్దం నాటి బ్రాహ్మీ శాసనం.. సోషల్ మీడియాలో వైరల్..