Revanth Reddy | తెలంగాణపై పెద్ద మనసు చూపండి.. ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి విన్నపం!

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్:Revanth Reddy | తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని, ఇందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతో అవసరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం హెచ్‌ఐసీసీ (HICC)లో నిర్వహించిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Revanth Reddy | రాజకీయాలు వద్దు..

“ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కాదు.. ఇదొక వికాస్ ఉత్సవం” అని రేవంత్ రెడ్డి అభివర్ణించారు. దేశ ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్న ప్రధాని సంకల్పానికి తాము పూర్తి మద్దతు ఇస్తామని, ‘వికసిత్ భారత్’ ప్రణాళికలో భాగస్వాములవుతామని స్పష్టం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయని, ఇప్పుడు రాజకీయాలు పక్కన పెట్టి కేవలం అభివృద్ధిపైనే దృష్టి సారించాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు.

Revanth Reddy | దేశానికి ఇంజిన్ లాంటిది తెలంగాణ..

దేశ జనాభాలో తెలంగాణ వాటా కేవలం 3 శాతమే ఉన్నప్పటికీ, దేశ జీడీపీకి మాత్రం 5 శాతం సహకారం అందిస్తోందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. “కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎప్పుడూ చెబుతుంటారు.. ప్రధానిది పెద్ద మనసు అని. అదే పెద్ద మనసును తెలంగాణపై కూడా చూపాలని కోరుతున్నాను” అని రేవంత్ విజ్ఞప్తి చేశారు. దేశాభివృద్ధిలో మోదీ కృషిని కొనియాడుతూనే, తెలంగాణకు దక్కాల్సిన ప్రాధాన్యతపై ఆయన దృష్టి సారించాలని కోరారు.

Revanth Reddy | సింగిల్ విండో విధానాన్ని ఏర్పాటు చేయాలి

దేశానికి సింహభాగం ఆదాయం అందిస్తున్న హైదరాబాద్‌తో సహా ఆరు మహానగరాల అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక ప్రోత్సాహం అందించాలని రేవంత్ సూచించారు. ఈ నగరాల అనుమతుల కోసం పీఎంవో (PMO)లో ఒక ప్రత్యేక విభాగం లేదా ‘సింగిల్ విండో’ విధానాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.

Revanth Reddy | ప్రధాని 2 గంటలు సమయం ఇస్తే చాలు..

తెలంగాణలో రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు విస్తరణ, మూసీ పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీ, మచిలీపట్నం పోర్టుకు హైవే వంటి కీలక ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని సీఎం తెలిపారు. “కేంద్రం ఎంత వేగంగా పనులు చేస్తోందో.. తెలంగాణలో అంత వేగంగా పనులు జరగడం లేదు. ప్రధాని కేవలం రెండు గంటలు సమయం ఇస్తే మా ప్రతిపాదనలన్నీ మీ ముందు ఉంచి, రాష్ట్ర అభివృద్ధికి అనుమతులు పొందుతాం” అని రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: PM Modi Visit | దేశాభివృద్ధిలో హైదరాబాద్​ పాత్ర కీలకం : ప్రధాని మోదీ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *