Land Resurvey | భూముల రీ సర్వే, ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

భూముల రీ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో పేదలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Land Resurvey | భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం భూముల రీ సర్వే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పైలెట్​ గ్రామాల్లో ప్రస్తుతం సర్వే సాగుతోంది. ఈ క్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

భూ భారతి (Bhu Bharati) చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే రాష్ట్రవ్యాప్తంగా రీ-సర్వేను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మాట్లాడారు. రీ-సర్వే, భూ భారతి అమలు, సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం, ఇందిరమ్మ ఇళ్లు తదితర అంశాలపై సూచనలు చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధరణిని రద్దు చేసి భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. అయితే చట్టం అమల్లోకి వచ్చి 15 నెలలు పూర్తయినా ప్రజల అంచనాలకు పూర్తిస్థాయిలో చేరలేకపోయామని అంగీకరించారు.

Land Resurvey | 95 శాతం సమస్యలు పరిష్కారం

review

భూ భారతి సమర్థవంతంగా అమలు కావాలంటే రీ-సర్వే తప్పనిసరి అని మేధావులు సూచించడంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా నక్షాలు లేని 413 ప్రాంతాల్లోని ఐదు గ్రామాల్లో నిర్వహించిన రీ-సర్వేతో 95 శాతం వరకు భూ సమస్యలు పరిష్కారమయ్యాయని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో భూ రీ-సర్వేను పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. తొలి విడతలో భాగంగా ప్రతి జిల్లాలో 70 గ్రామాలను ఎంపిక చేసి రీ-సర్వే చేపట్టినట్లు చెప్పారు.

Land Resurvey | వారికి ఎకరాకు రూ.50

భూముల రీ సర్వే కోసం శిక్షణ పొందిన లైసెన్స్ సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలని, రెగ్యులర్ సర్వేయర్లతో సమన్వయం చేసుకోవాలని మంత్రి సూచించారు. లైసెన్స్​డ్ సర్వేయర్లకు ఉద్యోగం, రెగ్యులరైజేషన్ హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. రీ-సర్వేలో పనిచేసే లైసెన్స్ సర్వేయర్లకు ఎకరానికి రూ.50తో పాటు రవాణా, ఇతర ఖర్చుల కోసం మరో రూ.10 కలిపి మొత్తం రూ.60 అందజేస్తామని వివరించారు. విధుల్లో చేరని వారికి గడువిచ్చి లైసెన్సులు రద్దు చేయాలని ఆదేశించారు.

Land Resurvey | రెెండో విడత ఇందిరమ్మ ఇళ్లపై..

మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. నిధులు విడుదలైనా పనులు చేపట్టని చోట్ల బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను వెంటనే పూర్తి చేయాలన్నారు. గుడిసెల్లో నివసించే కుటుంబాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఇసుక, కంకర సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

దీనిని కూడా చదవండి : Cobra in Scooter | స్కూటీలో నాగుపాము ప్రత్యక్షం.. కామారెడ్డిలో ఘటన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *