అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Khammam CI Harassment | రక్షణ కల్పించాల్సిన అధికారి భక్షకుడిగా మారాడు. భర్త వేధింపుల నుంచి న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఓ మహిళపై కన్నేసి, పెళ్లి పేరుతో ఆమెను నమ్మించి సీఐ వేధించిన దారుణ ఘటన ఖమ్మం (Khammam) జిల్లాలో వెలుగుచూసింది. బాధితురాలిని గర్భవతిని చేసి, బలవంతంగా అబార్షన్ చేయించిన ఖమ్మం సీసీఎస్ (CCS) సీఐ భూక్యా రాజు నాయక్‌పై కేసు నమోదు కాగా.. ఉన్నతాధికారులు ఆయనపై తక్షణ చర్యలు తీసుకున్నారు.
Khammam CI Harassment | సమస్యను ఆసరాగా చేసుకుని..
బాధితురాలి కథనం ప్రకారం.. 2023లో ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్‌లో రాజు నాయక్ సీఐ (CI Raju Nayak)గా విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఒక వివాహిత తన భర్త పెడుతున్న వేధింపులపై న్యాయం చేయాలంటూ సదరు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే, ఆమె ఇచ్చిన ఫిర్యాదు కాపీ నుంచి ఫోన్ నంబర్ సేకరించిన సీఐ రాజు నాయక్.. ఆమెపై కన్నేశాడు. కేసుకు సంబంధించి న్యాయం చేస్తానంటూ నమ్మించి, తరచూ ఫోన్లు, మెసేజ్‌లు చేస్తూ మాయమాటలతో దగ్గరయ్యాడు.
Khammam CI Harassment | గర్భవతిని చేసి..
బాధితురాలి ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని, తాను పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి ఆమెను లోబర్చుకున్నాడు. ఈ క్రమంలో సదరు మహిళ గర్భం దాల్చింది. దీంతో త్వరగా పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేయగా.. సీఐ రాజు నాయక్ అసలు స్వరూపం బయటపడింది. ఆమెకు బలవంతంగా కొన్ని మందులు (టాబ్లెట్లు) మింగించి అబార్షన్ చేయించాడు. ఆ తర్వాత కూడా పెళ్లి ఊసెత్తకుండా బాధితురాలిని మానసికంగా, శారీరకంగా వేధిస్తూ కాలయాపన చేయడం ప్రారంభించాడు. కాగా, ఇటీవలే సదరు మహిళకు ఆమె భర్త నుంచి కోర్టు ద్వారా అధికారికంగా విడాకులు కూడా మంజూరయ్యాయి.
Khammam CI Harassment | ఉన్నతాధికారుల యాక్షన్..
సీఐ చేతిలో మోసపోయానని గ్రహించిన బాధితురాలు.. ఎట్టకేలకు ధైర్యం చేసి ఈ నెల 7వ తేదీన ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ప్రాథమిక విచారణలో సీఐ రాజు నాయక్ లీలలు నిజమేనని తేలడంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసు ఉన్నతాధికారులు.. సీఐ రాజు నాయక్‌ను హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయానికి (DGP Office) అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలని స్థానిక మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
దీనిని కూడా చదవండి : Hyderabad Crime News|హైదరాబాద్‌లో ఘోరం.. సినిమా ఛాన్స్ ఇప్పిస్తామని యువతిపై గ్యాంగ్ రేప్


