అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Paddy Procurement | జిల్లాలో యాసంగి 2026 సీజన్‌కు సంబంధించిన వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ తుది దశకు చేరిందని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) తెలిపారు. మరో వారం రోజుల్లో సేకరణను పూర్తి చేసేలా చర్యలు చేపట్టామని ఆమె వెల్లడించారు.
Paddy Procurement | ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా ఆధ్వర్యంలో..
ప్రభుత్వం తరపున ధాన్యం సేకరణ కోసం ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా ఆధ్వర్యంలో ఈసారి జిల్లాలో మొత్తం 739 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 6.30లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తయ్యిందని, సుమారు రూ.1,500 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించగా, రైతుల ఖాతాల్లో రూ.1,320 కోట్లు జమా అయినట్లు వివరించారు. ధాన్యం సేకరణ పూర్తయిన ప్రాంతాల్లో ఇప్పటికే 430 కొనుగోలు కేంద్రాలను మూసివేసినట్లు తెలిపారు. ఇంకా మిగిలిన కొనుగోలు కేంద్రాల ద్వారా సుమారు 40వేల నుంచి 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందని, మరో వారం రోజుల్లో నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా కొనుగోళ్లు పూర్తి అవుతాయని పేర్కొన్నారు.
Paddy Procurement | వరికోతలు ఆలస్యమైనందున..
పలు ప్రాంతాల్లో వరి కోతలు ఆలస్యంగా జరుగుతున్న కారణంగా ఇప్పుడిప్పుడే దిగుబడులు వస్తుండటంతో, అలాంటి ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను కొనసాగిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. కాగా.. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కొనుగోలు కేంద్రాలు, రైస్‌మిల్లుల అన్‌లోడింగ్ పాయింట్ల వద్ద రైతులు, హమాలీల కోసం ఫస్ట్ ఎయిడ్ కిట్లు, తాగునీటి సదుపాయం, ఓఆర్ఎస్ సాచెట్లు, మజ్జిగ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కొన్ని రైస్‌మిల్లుల వద్ద మధ్యాహ్న సమయంలో ఉచిత భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
Paddy Procurement | సజావుగా సాగేందుకు కృషి..
ధాన్యం సేకరణ చివరి దశలో రైతులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందని కలెక్టర్ తెలిపారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలిస్తూ, రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరిగేలా ట్యాబ్ ఎంట్రీలను వేగవంతంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్రాల వద్ద సరిపడా సంఖ్యలో హమాలీలు అందుబాటులో ఉండడంతో పాటు, ధాన్యం రవాణా కోసం తగినన్ని లారీలను సమకూర్చినట్లు, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోందని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి..: Online Medicine Sales | ఆన్లైన్లో మందుల విక్రయాలతో ప్రజారోగ్యానికి ముప్పు


