అక్షరటుడే, మెదక్ : ADE Bribery Arrest | రాష్ట్రంలో అవినీతి అధికారులు మారడం లేదు. ప్రజలు, కాంట్రాక్టర్ల నుంచి లంచాలు తీసుకుంటూ భారీగా అక్రమాస్తులు కూడబెడుతున్నారు. తాజాగా మెదక్ జిల్లా నర్సాపూర్‌లో లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ ఏడీఈ రమణారెడ్డి ఏసీబీకి చిక్కాడు.
మెదక్ జిల్లా (Medak District) నర్సాపూర్ డివిజన్, ఆపరేషన్స్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ADE)గా ముద్దం రమణారెడ్డి పని చేస్తున్నాడు. ఓ వ్యక్తికి సంబంధించి రూ. 3,13,882 విలువ గల 11 వర్క్ బిల్లులను మెదక్ డివిజనల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఆపరేషన్స్‌కు పంపడం కోసం ఏడీఈ రూ.25 వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. ఈ మేరకు శుక్రవారం ఫిర్యాదుదారుడి నుంచి రూ.25 వేల లంచం తీసుకుంటుండగా.. ఏడీఈ రమణారెడ్డి ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో సోదాలు చేశారు.
ADE Bribery Arrest | లంచం అడిగితే ఫోన్ చేయండి
ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ నంబర్9440446106 లో ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. వెబ్సైట్ ద్వారా కంప్లైట్ చేయొచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.
ఇది కూడా చదవండి..: Telangana Road Funds | తెలంగాణకు మరిన్ని నిధులు ఇవ్వాలి : మంత్రి సీతక్క


