Azambad land | రియల్ ఎస్టేట్​ ఏజెన్సీగా మారిన ప్రభుత్వం : హరీశ్​రావు

ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిన ప్రభుత్వం భూములను అమ్ముకునే రియల్ ఎస్టేట్ ఏజెన్సీగా మారిందని హరీశ్​రావు విమర్శించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Azambad land | మాజీ మంత్రి హరీశ్​రావు (Harish Rao) కాంగ్రెస్​ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి భూములను అమ్ముకునే రియల్ ఎస్టేట్ ఏజెన్సీగా మారిపోయిందన్నారు. అజామాబాద్‌లో 500 కోట్ల విలువైన ప్రభుత్వ ఆయిల్‌ఫెడ్ (Oilfed) భూమిని కేవలం రూ.87 కోట్లకే ఒక ప్రైవేట్ వ్యక్తికి ఎందుకు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు.

సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy)కి హరీశ్​రావు బహిరంగ లేఖ రాశారు. సామాన్యుల ఆస్తులను 22A పేరుతో లాక్కుంటూ, ప్రభుత్వ భూములను పెద్దలకు పల్లీలు, బటానీల్లా దోచిపెడుతున్నారని ఆరోపించారు. ​వెంటనే అక్రమ కేటాయింపును రద్దు చేసి, ఆ 15,984 గజాల భూమిని ఆయిల్‌ఫెడ్‌ సంస్థకే దక్కేలా ఫ్రీహోల్డ్ హక్కులు కల్పించాలన్నారు. నగరం నడిబొడ్డున ఉన్న విలువైన ప్రభుత్వ ఆస్తులను కారుచౌకగా ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Azambad land | 3.23 ఎకరాలు

ఆర్టీసీ క్రాస్​రోడ్డులోని అజామాబాద్ ప్రాంతంలో 3 ఎకరాల 23 గుంటలు భూమి ఉందని హరీశ్​రావు తెలిపారు. ఏళ్ల నాటి ఆ భూమి సుప్రీంకోర్టు తీర్పుతో ప్రభుత్వానికి దక్కిందని చెప్పారు. ఆ భూమిని ఆయిల్​ఫెడ్​కు అప్పగిస్తే.. తాజాగా కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రైవేట్​ వ్యక్తులకు అప్పగించేందుకు యత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేవారు. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో ప్రైవేట్ శక్తులకు తలొగ్గకుండా వందల కోట్ల ప్రభుత్వ ఆస్తిని చిత్తశుద్ధితో కాపాడామన్నారు. దశాబ్దాలుగా న్యాయపోరాటం చేసి దక్కించుకున్న ప్రభుత్వ ఆస్తిని రాత్రికి రాత్రే ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం వెనుక కారణం ఏమిటని ప్రశ్నించారు.

Azambad land | ఆయిల్​ఫెడ్ ముందుకొచ్చినా..

మార్కెట్లో రూ.500 కోట్లు విలువ చేసే భూమిని రూ.87 కోట్లకే ఆ ప్రైవేట్ వ్యక్తికి కట్టబెట్టేందుకు ప్రభుత్వం ఎందుకు చూస్తోందని హరీశ్​రావు అన్నారు. సదరు భూమి ఫ్రీహోల్డ్ హక్కుల కోసం ఆ 87 కోట్ల రూపాయలు చెల్లించడానికి ఆయిల్​ఫెడ్​ సంస్థ ముందుకు వచ్చిందన్నారు. సొమ్ము చెల్లించడానికి ప్రభుత్వ సంస్థే సిద్ధంగా ఉన్నా… ఒక ప్రైవేట్ వ్యక్తికి ధారాదత్తం చేయడం వెనుక దాగి ఉన్న కుంభకోణం ఏమిటన్నారు. ప్రభుత్వ ఆస్తులను అమ్ముకుంటు పోతే చివరకు శ్మశానానికి కూడా భూమి లేని దయనీయ పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

దీనిని కూడా చదవండి : Sajjala Comments | అటెన్షన్ కోసమే విజయ సాయిరెడ్డి ఆరోపణలు : సజ్జల

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *