అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Behari Lal Engineering IPO | ప్రధానంగా స్టీల్, విద్యుత్, హెవీ ఇంజినీరింగ్ వంటి పరిశ్రమల్లో వినియోగించే మెటల్ రోల్స్, ఇంజినీరింగ్ కాస్టింగ్స్, అల్లాయ్ స్టీల్ ఉత్పత్తులు, ఫోర్జింగ్ ఇంగాట్స్ తయారు చేసే బేహారీ లాల్ ఇంజినీరింగ్ కంపెనీ.. పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. కంపెనీ ఐపీవో సబ్‌స్క్రిప్షన్ ఆగస్టు 12న ప్రారంభమై ఆగస్టు 14న ముగిసింది. షేర్ల అలాట్‌మెంట్ స్టేటస్ 17న రాత్రి వెలువడగా.. కంపెనీ షేర్లు 19న బీఎస్ఈ, ఎన్ఎస్ఈ లలో లిస్టయ్యాయి.
Behari Lal Engineering IPO | రూ. 302 కోట్ల ఇష్యూ..
దేశీయ మార్కెట్‌తో పాటు విదేశీ మార్కెట్లలోనూ కార్యకలాపాలు కొనసాగిస్తోన్న బేహారీ లాల్ ఇంజినీరింగ్ కంపెనీ.. ప్రెసిషన్ ఇంజినీరింగ్ భాగాలను 21 దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఈ కంపెనీ ఐపీవో (IPO) ద్వారా రూ. 302 కోట్లు సమీకరించింది. ఇందులో రూ. 93 కోట్లు ఫ్రెష్ ఇష్యూ కాగా.. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా మిగతా మొత్తాన్ని సమీకరించింది.
Behari Lal Engineering IPO | మంచి డిమాండ్..
చిన్న ఐపీవో కావడం, జీఎంపీ బాగుండడంతో డిమాండ్ ఏర్పడింది. ఇష్యూ మొత్తం 118 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇందులో క్యూఐబీ కోటా 222 రెట్లు, ఎన్ ఐఐ కోటా 168 రెట్లు, రిటైల్ కోటా 54.12 రెట్లు సబ్‌స్క్రైబ్ కావడం గమనార్హం.
Behari Lal Engineering IPO | 63 శాతం ప్రీమియంతో ఎంట్రీ..
బేహారీ లాల్ ఇంజినీరింగ్ కంపెనీ స్టాక్ మార్కెట్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరును రూ. 285 కి విక్రయించగా.. బుధవారం స్టాక్ మార్కెట్‌లో కంపెనీ షేర్లు రూ. 465 వద్ద లిస్టయ్యాయి. అంటే ఐపీవో అలాట్ అయినవారికి లిస్టింగ్ సమయంలోనే 63 శాతం లాభాలు వచ్చాయన్న మాట. ఇంట్రాడే లో రూ. 529 వద్ద గరిష్ఠాన్ని నమోదు చేశాయి . ఉదయం 11 గంటల ప్రాంతంలో కంపెనీ షేర్లు 77 శాతం ప్రీమియంతో రూ. 506 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి..: Gaja Capital IPO | పబ్లిక్ ఇష్యూకు అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ.. జీఎంపీ ఎంతంటే?