అక్షరటుడే, వెబ్‌డెస్క్: BRS 1000 Days Protest | కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో 1000 రోజులు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో ఆ పార్టీపై రాజకీయంగా ఒత్తిడి పెంచేందుకు బీఆర్‌ఎస్ కార్యాచరణకు సిద్ధమైంది.
సెప్టెంబరు 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వ హామీలు, పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నిర్ణయించింది.
బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కమిటీ సభ్యులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గం నుంచి గ్రామం, వార్డు స్థాయి వరకు పార్టీ శ్రేణులు పాల్గొని ప్రభుత్వ పనితీరుపై ప్రజలకు వివరించాలని సూచించారు.
BRS 1000 Days Protest | హామీల అమలుపై బీఆర్‌ఎస్ విమర్శలు
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, వివిధ డిక్లరేషన్లు, గ్యారెంటీల అమలును ప్రధానంగా ప్రజల్లో చర్చకు తీసుకెళ్లాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల్లో ఎంతవరకు అమలు జరిగిందో ప్రజలకు వివరించాలని అన్నారు.
అదే సమయంలో కేవలం ఎన్నికల హామీలకే ప్రచారాన్ని పరిమితం చేయకుండా, 1000 రోజుల పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ పనితీరులో లోపాలుగా బీఆర్‌ఎస్ భావిస్తున్న అంశాలను కూడా ప్రస్తావించాలని సూచించారు.
BRS 1000 Days Protest | ‘బాకీ కార్డుల’తో ప్రచారం
వివిధ వర్గాలకు ఇచ్చిన హామీల అమలు పరిస్థితిని ప్రజలకు వివరించేందుకు ‘బాకీ కార్డులు’ రూపొందించి ప్రచారం నిర్వహించాలని కేటీఆర్ సూచించారు. రైతులు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, యువత తదితర వర్గాలకు సంబంధించిన హామీలు, వాటి అమలు స్థితిని ఈ ప్రచారంలో ప్రస్తావించాలని పార్టీ నిర్ణయించింది.
Konda Sushmitha | తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా కల్లోలం.. సుష్మిత తిరుగుబాటు వెనుక అసలు కథేంటి?
ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశాన్ని కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్ సూచించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యలపై కళాశాలల స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.
BRS 1000 Days Protest | వర్గాల వారీగా ప్రత్యేక కార్యక్రమాలు
ఆటో డ్రైవర్లు, రైతులు, మహిళలు, గిరిజనులు, దళితులు, బీసీలు, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు సహా వివిధ వర్గాలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలని కేటీఆర్ సూచించారు. ఆయా వర్గాలకు సంబంధించిన సమస్యలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, వాటి అమలుపై కార్యక్రమాల్లో చర్చించాలని అన్నారు.
సెప్టెంబరు 2 నుంచి ఏడు రోజుల పాటు మహిళలు, రైతులు, యువత, విద్యార్థులు తదితర వర్గాలను కలిసేలా కార్యక్రమాలను రూపొందించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది.
BRS 1000 Days Protest | సోషల్ మీడియాపైనా ప్రత్యేక దృష్టి
కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై చేపట్టే ప్రచారంలో సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించాలని కేటీఆర్ సూచించారు. ముఖ్యంగా యువతకు చేరువయ్యేలా వినూత్నమైన ప్రచార కార్యక్రమాలు, డిజిటల్ కంటెంట్‌ను రూపొందించాలని పార్టీ శ్రేణులను కోరారు.
ప్రభుత్వ హామీలు, పాలనా పనితీరుపై ప్రజల్లో అవగాహన కల్పించేలా ప్రచారాన్ని రూపొందించాలని, సంప్రదాయ కార్యక్రమాలతో పాటు కొత్త తరానికి చేరువయ్యే విధానాలను అనుసరించాలని సూచించారు.
BRS 1000 Days Protest | గ్రామస్థాయి వరకు పార్టీ శ్రేణుల భాగస్వామ్యం
వారం రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు, మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ జడ్పీ చైర్మన్లు సహా పార్టీ నాయకులంతా పాల్గొనాలని కేటీఆర్ కోరారు.
ప్రతి నియోజకవర్గం, మండల కేంద్రం, గ్రామం, వార్డు స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును ప్రజల ముందుంచాలని పిలుపునిచ్చారు. ఆయా ప్రాంతాల సమస్యలకు అనుగుణంగా కార్యక్రమాల రూపకల్పనలో స్థానిక నాయకత్వం చొరవ చూపాలని సూచించారు.
బీఆర్‌ఎస్ చేపట్టనున్న ఈ వారం రోజుల కార్యక్రమాల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై ప్రజల్లో విస్తృత చర్చకు తెరతీయాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది.