అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nizamabad Revenue Conclave | ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రెవెన్యూ ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం ‘రెవెన్యూ కాంక్లేవ్–2026’ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలు, సంక్షేమం, సంఘాల మధ్య సమన్వయం, వృత్తిపరమైన అభివృద్ధి, సామాజిక సేవ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
Nizamabad Revenue Conclave | ఐక్యంగా పనిచేయాలి
కార్యక్రమానికి తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి. లచ్చిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి వివిధ ఉద్యోగ సంఘాలు సమన్వయంతో, ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగుల సంక్షేమంతో పాటు వృత్తిపరమైన సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
Nizamabad Revenue Conclave | విద్యార్థులకు నిత్యావసర సామగ్రి పంపిణీ
కాంక్లేవ్‌లో భాగంగా సామాజిక సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. బాల్కొండలోని బీసీ సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు గిఫ్ట్ ప్యాక్‌లు, అవసరమైన నిత్యావసర వస్తువులను అందజేశారు. విద్యార్థుల వినియోగం కోసం వాటర్ ప్యూరిఫయర్‌ను కూడా పంపిణీ చేశారు.
LRESS భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమం ద్వారా రెవెన్యూ ఉద్యోగులు తమ సామాజిక బాధ్యతను చాటుకున్నారు. ఉద్యోగుల సంక్షేమంతో పాటు సమాజానికి తమ వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలను కొనసాగించాలని సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
కార్యక్రమంలో టి.జి.ఆర్.ఎస్.ఏ రాష్ట్ర అధ్యక్షుడు బాణాల రాంరెడ్డి, టి.జి.టి.ఏ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పి. రాధ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల ఐక్యత, సంక్షేమం, సామాజిక సేవకు ప్రాధాన్యం ఇస్తూ రెవెన్యూ కాంక్లేవ్ నిర్వహించడం పట్ల పాల్గొన్న ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.