అక్షరటుడే, కామారెడ్డి: Capsicum Farming Profits | కూరగాయల సాగుతో తక్కువ పెట్టుబడికి అధిక ఆదాయం పొందవచ్చని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) అన్నారు. ఆరతడి పంటలు సాగుచేస్తున్న రైతు కొమిరెడ్డి అంజయ్య మిర్చి, క్యాప్సికం తోటలను శనివారం సందర్శించారు.
Capsicum Farming Profits | మూడేళ్లుగా క్యాప్సికం సాగు..
పంటల సాగు విధానం, దిగుబడి, మార్కెటింగ్, ఆదాయం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతు కోమిరెడ్డి అంజయ్య మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా క్యాప్సికం సాగు చేస్తున్నానని తెలిపారు. ఒక ఎకరా విస్తీర్ణంలో క్యాప్సికం సాగు చేసి సుమారు 30 టన్నుల దిగుబడిని సాధించినట్లు వెల్లడించారు. పండించిన పంటను టన్నుకు రూ.40 వేలు చొప్పున విక్రయించగా మొత్తం రూ.12 లక్షల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. సాగు ఖర్చులు పోను సుమారు రూ.10 లక్షల వరకు నికర ఆదాయం పొందినట్లు సంతోషం వ్యక్తం చేశారు. ఇతర రైతులు కూడా పంటల మార్పిడి విధానాన్ని అనుసరిస్తూ కూరగాయల సాగుపై దృష్టి సారించాలని సూచించారు.
Capsicum Farming Profits | సంప్రదాయ సాగుతో లాభాలు..
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. సంప్రదాయ పంటలతో పాటు ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించడం ద్వారా వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చుకోవచ్చని పేర్కొన్నారు. మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకొని, ఆధునిక సాగు పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు, మెరుగైన ఆదాయం సాధించాలని సూచించారు. రైతులు తమకున్న భూమి, నీటి వనరులు, మార్కెట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించుకోవాలని, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారుల సలహాలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్వై గిరి, జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ అధికారి జ్యోతి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రెడ్డి, ఉద్యాన శాఖ అధికారి సుమన్, ఉద్యాన విస్తరణ అధికారి బాపురెడ్డి, ఇతర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Arsapalli ROB Works | నేను రోడ్డెక్కితేనే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది..: ఎంపీ అర్వింద్