Crop Diversification | పంట మార్పిడి సాధ్యమేనా.. అన్నదాతల ఆందోళన

పంట మార్పిడి చేయాలని సీఎం రేవంత్​రెడ్డి సూచించారు. దీంతో రైతులు ఏ పంట వేయాలని ఆందోళన చెందుతున్నారు.

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Crop Diversification | రాష్ట్రంలో వానాకాలం సీజన్​ ప్రారంభం అయింది. రైతులు సాగు పనుల్లో బిజీ అయ్యారు. అయితే ఏ పంట వేయాలని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

వానాకాలం తుకాలు పోస్తున్నా.. ఇంకా పలు ప్రాంతాల్లో యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాలేదు. వర్షాలకు ధాన్యం తడిసి మొలకలు వస్తోంది. దీంతో వానాకాలంలో అయినా వడ్లు కొంటారా లేదా అన్ని రైతులు (Farmers) భయపడుతున్నారు. వడ్లు, మక్కలతో సమస్యలు ఎక్కువ అవుతున్నాయని సీఎం అనడంతో రైతులు మరింత ఆందోళనకు గురి అవుతున్నారు.

రాష్ట్రంలో వానాకాలం సీజన్​లో అత్యధిక విస్తీర్ణంలో వరి సాగు చేస్తారు. అనంతరం మక్కలు, పత్తి, మిర్చి వేస్తారు. పప్పు దినుసులు, తృణ ధాన్యాల పంటల తక్కువ మొత్తంలో వేస్తారు. అయితే వరి సాగుతో ప్రతి సంవత్సరం పెరుగుతుండటంతో ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తున్నాయి. యాసంగి సీజన్​లో ధాన్యం అమ్ముకోవడానికి అన్నదాతలు అష్టకష్టాలు పడ్డారు. లారీలు రాకపోవడం, హమాలీలు లేకపోవడంతో నెలల తరబడి కేంద్రాల్లో పడిగాపులు కాశారు. జూన్​ రెండో వారం వచ్చినా.. ఇంకా పలు ప్రాంతాల్లో ధాన్యం కొనుగోళ్లు సాగుతున్నాయి. ఓ వైపు రైతు భరోసా సకాలంలో రాకపోవడం, వడ్లు అమ్ముడు పోకపోవడంతో వానాకాలం పెట్టుబడి కోసం రైతులు ఆందోళన చెందుతున్నారు.

Crop Diversification | సీఎం వ్యాఖ్యలతో..

Crop Diversification

ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) మంగళవారం సాయంత్రం మహిళా సదస్సులో మాట్లాడుతూ.. పంట మార్పిడి చేయాలని రైతులకు సూచించారు. వరి, మక్కల సాగుతో ఇబ్బందులు అవుతున్నాయన్నారు. కూరగాయలు, పప్పు దినుసులు, పండ్ల తోటల పెంపకం చేపట్టాలని కోరారు. సీఎం వ్యాఖ్యలతో రైతులు అయోమయానికి గురి అవుతున్నారు. వరి వేశాక కొంటారా లేదా అని ఆందోళన చెందుతున్నారు. తీరా పంట చేతికొచ్చాక కొనకపోతే తమ పరిస్థితి ఏమిటని భయపడుతున్నారు.

Crop Diversification | సన్నాల వైపు మొగ్గు

రాష్ట్రంలో సన్న రకం, దొడ్డు రకం వరిని గతంలో సాగు చేసేవారు. ప్రభుత్వం బోనస్​ ఇస్తామని చెప్పడంతో చాలా మంది రైతులు సన్నాలు వేస్తున్నారు. అయితే దిగుబడి తక్కువగా రావడం, తెగుళ్ల బెడదతో పలువురు రైతులు దొడ్డు రకం వరి సాగు చేసేవారు. ప్రస్తుతం వారు కూడా సన్నాల వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో దొడ్డు వడ్లను కొన ప్రభుత్వం రేషన్​ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు అందించేది. ప్రస్తుతం సన్న బియ్యం సరఫరా చేస్తుండటంతో దొడ్డు వడ్లు కొంటారో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా యాసంగి సీజన్​లో వడ్ల కాంటాల కోసం పడ్డ కష్టాలతో వారు భయపడుతున్నారు. దీంతో సన్నాలు సాగు చేస్తే ప్రభుత్వం కొంటుందని భావిస్తున్నారు. విత్తన దుకాణాల డీలర్లు సైతం ఈ సారి ఎక్కువ మొత్తం సన్నరకం విత్తనాలు అందుబాటులో ఉంచారు.

Crop Diversification | రైతులపై భారం

Crop Diversification

సన్న రకం వరి సాగు చేస్తే దిగుబడి తక్కువగా వస్తుంది. అంతేగాకుండా తెగుళ్ల బెడద అధికంగా ఉంటుంది. ఫలితంగా పురుగు మందులకు అధికంగా వెచ్చించాలి. ఇప్పటికే కాంప్లెక్స్​ ఎరువల ధరలు పెరిగాయి. మరోవైపు డీజిల్​ ధరలు పెరగడంతో ట్రాక్టర్ల కిరాయిలు పెంచారు. దీంతో అన్నదాతలపై ఇప్పటికే అదనపు భారం పడనుంది. మరోవైపు సన్నాలు వేస్తే దిగుబడి తగ్గి రైతులు నష్టపోనున్నారు. అయితే ప్రభుత్వం బోనస్​ ఇస్తే మాత్రం రైతులకు మేలు జరుగుతుంది. కానీ అసలు ధాన్యం కొంటారా లేదా అని ఆందోళన చెందుతున్న రైతులు బోనస్​ కోసం ఆలోచించండం లేదు.

Crop Diversification | కోతుల బెడద

ప్రభుత్వం పంట మార్పిడి విధానం అవలంభించాలని సూచిస్తోంది. పండ్ల తోటలు, కూరగాయలు సాగు చేయాలని చెబుతోంది. అయితే ప్రస్తుతం ప్రతిగ్రామంలో కోతుల బెడద అధికంగా ఉంది. కూరగాయలు, పండ్ల తోటలు సాగు చేస్తే వాటి నుంచి పంటలను కాపాడుకోవడం కష్టం. వరి పంటనే కోతులు ధ్వంసం చేస్తున్నాయి. ఇక కూరగాయలు వేస్తే తమ పరిస్థితి ఏమిటని రైతులు అంటున్నారు. కోతుల బెడద నివారణకు చర్యలు చేపడితే పంటలు మార్చడానికి రైతులు ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Crop Diversification | పత్తా లేని వ్యవసాయ అధికారులు

సాగు సీజన్​ ప్రారంభం అయినా వ్యవసాయ అధికారులు గ్రామాల్లో కనబడటం లేదు. గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాల్సిన ఏఈవోలు మండల కేంద్రాలకు పరిమితం అవుతున్నారు. మొక్కుబడిగా గ్రామాలకు వచ్చి వెళ్తున్నారు. ప్రస్తుతం ఎల్​నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా పడే అవకాశం ఉంది. వరి సాగు చేస్తే నీరు ఎక్కువగా కావాలి. దీంతో ఇతర పంటలు వేయాలని రైతులకు చెప్పాల్సిన వ్యవసాయ అధికారులు పత్తాకు లేకుండా పోయారు. దీంతో అన్నదాతలు యథావిథిగా వరి విత్తనాలు కొనుగోలు చేసి తుకాలు పోస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Mohan Naik Arrest | ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ మోహన్‌ నాయక్‌కు 14 రోజుల రిమాండ్‌

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *