అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: DGP CV Anand Nizamabad | పోలీసులపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) పేర్కొన్నారు. సీపీ కార్యాలయంలో (Nizamabad) శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
DGP CV Anand Nizamabad | డ్రగ్స్, గంజాయి ముఠాలు, రౌడీ గ్యాంగ్‌లపై ఉక్కుపాదం
ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. డ్రగ్స్, గంజాయి ముఠాలు, రౌడీ గ్యాంగ్‌లపై ఉక్కుపాదం మోపుతున్నామని పేర్కొన్నారు. యూనిఫాంలో ఉన్న పోలీసులను విధి నిర్వహణలో అడ్డుకున్నా, వారిపై దాడులకు పాల్పడినా సహించేది లేదని స్పష్టం చేశారు. అదే సమయంలో పోలీసులు ఎవరైనా తప్పు చేసినట్లయితే ప్రజలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. డ్రగ్స్, గంజాయి ముఠాలు, రౌడీ గ్యాంగ్‌లను అణచివేసేందుకు సమర్థవంతమైన పోలీసింగ్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ డీఎస్పీ కార్యాలయం, ముగ్పాల్ నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించారు.
DGP CV Anand Nizamabad | డ్రగ్స్ జోలికి వెళ్లవద్దు..
జిల్లా పోలీసులు చేపట్టిన డీ అడిక్షన్ సెంటర్ల ద్వారా డ్రగ్స్ నుంచి విముక్తి పొందిన డ్రగ్స్ బాధితులతో డీజీపీ మాట్లాడారు. డ్రగ్స్ జోలికి భవిష్యత్తులో వెళ్ళవద్దని.. సూచించారు. నేరాలు నియంత్రణ చేస్తున్నట్టుగా వివరిస్తూ, కొన్ని లోపాలను సరి చేసుకోవాలని సూచిస్తూ జిల్లా పోలీసుల పనితీరును అభినందించారు. నిజామాబాద్ రూరల్‌లోని డీఎస్పీ కార్యాలయం, మోగ్పాల్లోని నూతన పోలీస్ స్టేషన్ కార్యాలయాల ప్రారంభోత్సవంలో స్థానిక నాయకులు షబ్బీర్ అలీ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి , ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
DGP CV Anand Nizamabad | శాంతిభద్రతల పరిరక్షణలో భేష్..
జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని డీజీపీ అభినందించారు. మతసామరస్యం, శాంతిభద్రతల పరిస్థితి అదుపులో ఉండటం సంతృప్తికరమన్నారు. తెల్లంపూర్ విలేజ్ ఘటన నేపథ్యంలో విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీల పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని, చట్టాన్ని చేతిలోకి తీసుకున్న వారిపై ఈ ఏడాది 69 కేసులు వీడీసీ ఆగడాలపైనే నమోదైనట్టుగా వివరించారు. ఒకప్పుడు నక్సల్స్ తూటాల శబ్దాలతో మారుమోగిన ప్రాంతాలు నేడు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని పేర్కొన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోయి, సమాజ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. అయితే, వారి కదలికలపై పోలీసుల నిఘా కొనసాగుతుందని విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
మా ఊరు.. మా భద్రతతో ప్రజలకు చేరువ
నిజామాబాద్ పోలీసులు ‘సంకల్పం’, ‘మా ఊరు.. మా భద్రత’ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువవుతూ నేరాల నియంత్రణకు కృషి చేస్తున్నారని డీజీపీ పేర్కొన్నారు. పెట్రోలింగ్‌ను మరింత సమర్థంగా నిర్వహిస్తూ నేరాల నియంత్రణలో మంచి ఫలితాలు సాధిస్తున్నారని ప్రశంసించారు. కొన్ని అంశాల్లో ఉన్న లోపాలను గుర్తించి, వాటిని సరిదిద్దుకోవాలని సిబ్బందికి సూచించారు.
నిజామాబాద్‌తో 27 ఏళ్ల అనుబంధం
నిజామాబాద్‌తో తనకున్న అనుబంధాన్ని డీజీపీ ఆనంద్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. సుమారు 27 ఏళ్ల క్రితం ఇక్కడ పనిచేసిన రోజులను నెమరువేసుకున్నారు. అప్పట్లో చేపట్టిన భవన నిర్మాణాలకు సంబంధించిన శిలాఫలకాలను పరిశీలించారు. తనతో కలిసి పనిచేసిన పాత సిబ్బందిని పేరుపేరునా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సలీం అనే అనే ఉద్యోగి కనిపించకపోవడంతో మసూద్ గురించి ఆరా తీశారు. చంద్రకళ అనే మహిళా ఉద్యోగిని పలకరించి, ఆమె కుటుంబ వివరాలను కూడా గుర్తుచేసుకున్నారు. నిజామాబాద్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, తన కుమారుల పేర్లలోనూ ఆ ప్రాంతంతో ఉన్న అనుబంధం ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.
గోదావరి పుష్కరాలకు పటిష్ఠ భద్రత
రానున్న గోదావరి పుష్కరాలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు డీజీపీ వివరించారు. పుష్కరాల సమయంలో రోజుకు సుమారు 2.5 లక్షల మంది, మొత్తం 1.3 కోట్ల మంది భక్తులు వచ్చే అంచనాతో బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, ఇతర భద్రతా చర్యలపై ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీసులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తూనే సామాన్య ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని డీజీపీ సూచించారు.
పెరిగిన చిన్న తరహా మోసాలు..!
నిజామాబాద్ సీపీ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో… తీవ్రమైన నేరాలు తగ్గుముఖం పడుతున్నా.. ఆర్థిక మోసాలు, మాదకద్రవ్యాల కేసులు, రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నట్లుగా వివరించారు. హత్యలు, తీవ్రమైన అత్యాచారాలు, రాత్రి వేళల్లో ఇళ్లలో చోరీలు తగ్గగా.. చీటింగ్, నమ్మకద్రోహం కేసులు 34 నుంచి 35 శాతం, సాధారణ గాయాల కేసులు 18 శాతం, డ్రగ్స్ కేసులు 47 శాతం, రోడ్డు ప్రమాదాలు 10 శాతం పెరిగాయని సీపీ పేర్కొన్నారు.
ఆ ఐదు స్టేషన్ల పరిధిలోనే 30శాతం నేరాలు..
2026లో నమోదైన నేరాలపరంగా ఆర్మూర్ పోలీస్‌స్టేషన్ 607 కేసులతో మొదటి స్థానంలో ఉంది. నిజామాబాద్ రూరల్ 460, టౌన్-I 449, బోధన్ 443, ఫోర్త్టౌన్లో 410 కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ ఐదు పోలీస్‌స్టేషన్ల పరిధిలోనే కమిషనరేట్ మొత్తం నేరాల్లో 30 శాతం నమోదయ్యాయి. ఆయా స్టేషన్ల పరిధిలో 1,393 కేసులు ఇంకా దర్యాప్తులో ఉన్నాయి. నిజామాబాద్ రూరల్‌లో నేరాలు గత ఏడాదితో పోలిస్తే 24 శాతం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని సీపీ వివరించారు.
పనితీరులో వెనుకబడిన స్టేషన్లు ఇవే..
నూతన క్రిమినల్ చట్టాల అమలు, కేసుల పరిష్కారం, 60, 90 రోజుల గడువులో దర్యాప్తు పూర్తి చేయడం, సంఘటన స్థలంలోనే ఎఫ్‌ఐఆర్ నమోదు, ఈ-పెట్టీ కేసుల పరిష్కారం తదితర అంశాల ఆధారంగా పోలీస్‌స్టేషన్ల పనితీరును సమీక్షించారు. ఈ ప్రమాణాల్లో నిజామాబాద్ టౌన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, నిజామాబాద్ టౌన్-3, భిక్కనూరు, బోధన్, నవీపేట్, ముప్కాల్ పోలీస్‌స్టేషన్ల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నట్లు గుర్తించారు. ఈ కార్యక్రమంలో ఐజీ కార్తికేయ (మల్టీజోన్–1), సీఐడీ డీఐజీ నారాయణ నాయక్, సైబర్ సెక్యూరిటీ ఎస్పీ హర్షవర్ధన్, ఎస్పీ ప్రవీణ్‌కుమార్, ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్‌తో, నిజామాబాద్ అడిషనల్ డీసీపీ శుభం ప్రకాష్, డీసీపీలు, ఏసిపి లు, ఎస్హెచ్ఓలు ఎస్సైలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: సిటీ బస్సుల వినియోగం..అప్పుడే ట్రాఫిక్ కు చెక్