Diwali Fire Safety | పటాకుల మోతలో భద్రత మరవొద్దు..!. జాగ్రత్తలు పాటిస్తే దీపావళి సంబురమే..

దీపావళి పండుగ వేళ బాణసంచా వెలుగులు, పటాకుల మోతతో పల్లె, పట్టణాలు సందడిగా మారనున్నాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, భీమ్‌గల్: Diwali Fire Safety | దీపావళి పండుగ వేళ బాణసంచా వెలుగులు, పటాకుల మోతతో పల్లె, పట్టణాలు సందడిగా మారనున్నాయి. అయితే ఈ ఆనందోత్సాహాల మధ్య చిన్నపాటి నిర్లక్ష్యం ప్రాణాల మీదకు తెచ్చే ప్రమాదం ఉంది.

ముఖ్యంగా పటాకుల విక్రయ దుకాణాల ఏర్పాటు నుంచి వాటి నిల్వలు, విద్యుత్‌ సరఫరా, అగ్నిమాపక ఏర్పాట్ల వరకు ప్రతి అంశంలో జాగ్రత్తలు అవసరం. మరోవైపు పటాకుల కాల్చే సమయంలో చిన్నారులను పెద్దలు నిరంతరం పర్యవేక్షించాలి. కంటి గాయాలు, కాలిన గాయాలు, అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Diwali Fire Safety | అనుమతులపై నిఘా అవసరం

నిజామాబాద్, కామారెడ్డి జిల్లా (Kamareddy District)ల్లో దీపావళి సందర్భంగా తాత్కాలిక బాణసంచా దుకాణాలు ఏర్పాటయ్యాయి. వీటిలో ఎన్ని దుకాణాలకు అన్ని శాఖల నుంచి అనుమతులు వచ్చాయి? ఎన్ని చోట్ల అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి? అనే అంశాలపై స్పష్టమైన వివరాలు ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో సుమారు 30 టపాకులు దుకాణాలు ఏర్పాటు కాగా, వాటిలో సగానికి పైగా దుకాణాలకు అనుమతులు ఉన్నట్లు తెలిసింది. మిగిలిన దుకాణాల అనుమతులపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సంబంధిత శాఖలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి నిబంధనలు ఉల్లంఘిస్తున్న దుకాణాలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిజామాబాద్​ జిల్లాలోని పాలిటెక్నిక్​ కళాశాలలో తాత్కాలిక దుకాణాల్లో క్రయ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.

Diwali Fire Safety | నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో టపాసుల దుకాణాల ఏర్పాటుకు సంబంధిత డివిజనల్ పోలీస్ అధికారుల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందాలని పోలీస్ కమిషనర్ పి.సాయిచైతన్య గతంలోనే స్పష్టం చేశారు. నిర్ణీత బహిరంగ ప్రదేశాల్లోనే దుకాణాలు ఏర్పాటు చేయాలని, స్థలానికి అవసరమైన నిరభ్యంతర పత్రాలు సమర్పించాలని సూచించారు. ఒక క్లస్టర్‌లో 50 దుకాణాలకు మించి ఉండకూడదని, రద్దీ ప్రాంతాలు, కల్యాణ మండపాలు, సమావేశ కేంద్రాల్లో దుకాణాల ఏర్పాటుకు అనుమతి లేదని హెచ్చరించారు. అనుమతులు లేకుండా దుకాణాలు నిర్వహిస్తే పేలుడు పదార్థాల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వ్యాపారులతో ఇటీవల సమావేశం అయి అవగాహన కల్పించారు.

Diwali Fire Safety | కంటి చూపుపై ప్రభావం పడకుండా..

పటాకుల కాల్చే సమయంలో వెలువడే నిప్పురవ్వలు కళ్లకు తగిలితే తీవ్ర గాయాలయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చిచ్చుబుడ్లు, భూచక్రాలు, రాకెట్లు, మతాబులు కాల్చేటప్పుడు తగినంత దూరం పాటించాలి. పిల్లలు పటాకులు కాల్చేటప్పుడు పెద్దలు పక్కనే ఉండాలి. వీలైతే రక్షణ కళ్లద్దాలు ధరించాలి. పటాకుల వెలిగించే సమయంలో ముఖాన్ని వాటికి దగ్గరగా పెట్టకూడదు. చేతిలో పట్టుకుని కాల్చే పటాకులకు దూరంగా ఉండాలి. పేలని పటాకుల దగ్గరకు వెంటనే వెళ్లకూడదు. వాటిని తిరిగి వెలిగించే ప్రయత్నం చేయకూడదు. పిల్లలు టపాసులతో ఆడుకుంటూ ఒకరిపై మరొకరు విసరకుండా చూడాలి. ఇంట్లో పటాకులు కాల్చే ప్రాంతంలో నీటి బకెట్, ఇసుక అందుబాటులో ఉంచుకోవాలి. పటాకులు కాల్చే సమయంలో వదులైన దుస్తులు కాకుండా శరీరానికి దగ్గరగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం మంచిది. ఇళ్లలో, అపార్ట్‌మెంట్లలో, వాహనాల పార్కింగ్ ప్రాంతాల్లో, విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు, పెట్రోల్ బంకుల సమీపంలో బాణసంచా కాల్చకూడదు.

Diwali Fire Safety | కంటికి గాయమైతే ఏం చేయాలి?

పటాకులు నిప్పురవ్వలు కంటిలో పడితే కళ్లను నలపకూడదు. స్వయంగా మందులు, ఆయింట్‌మెంట్లు వేయకూడదు. కంటిలో ఇరుక్కున్న వస్తువులను చేతులతో తొలగించే ప్రయత్నం చేయకూడదు. వెంటనే సమీప కంటివైద్య నిపుణుడిని లేదా ఆస్పత్రిని సంప్రదించాలి. కంటికి గాయం జరిగినప్పుడు ఆలస్యం చేయడం చూపుపై శాశ్వత ప్రభావం చూపే అవకాశం ఉంది. కాలిన గాయాల విషయంలోనూ తగిన ప్రాథమిక చికిత్స అందించి వైద్యులను సంప్రదించాలి.

Diwali Fire Safety | అప్రమత్తంగా ఉండాలి..

తెలంగాణ అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ నవంబర్ 6న రాష్ట్రవ్యాప్తంగా దీపావళి భద్రతా ఏర్పాట్లను సమీక్షించి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా బాణసంచా విక్రయాలకు సంబంధించి 7,601 లైసెన్సులు జారీ చేసినట్లు శాఖ వెల్లడించింది. ఉమ్మడి జిల్లాలో తాత్కాలిక దుకాణాల వద్ద అగ్నిమాపక ఏర్పాట్లను సంబంధిత అధికారులు సమన్వయంతో తనిఖీ చేయాలి. అనుమతులు లేని దుకాణాలను గుర్తించి చర్యలు తీసుకోవడంతోపాటు, ప్రజలకు అత్యవసర సేవలపై అవగాహన కల్పించాలి. దీపావళి అంటే వెలుగుల పండుగ. ఆ వెలుగులు ఎవరి జీవితాల్లోనూ చీకట్లు నింపకూడదు. వ్యాపారులు నిబంధనలు పాటించడం, అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయడం, ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు.

ప్రజలు జాగ్రత్తలు పాటించాలి..

– రాములు, సూపరింటెండెంట్​, జీజీహెచ్​
దీపావళి సందర్భంగా ప్రజలు ముఖ్యంగా పిల్లలు జాగ్రత్తగా పటాకులు కాల్చాలి. జిల్లా జనరల్​ ఆస్పత్రిలో కాలిన గాయాలకు చికిత్స సందర్భంగా ప్రత్యేకంగా పది బెడ్లతో ఏర్పాట్లు చేశాం. వైద్యులను సైతం అందుబాటులో ఉంచాము. ప్రజలు పటాకులు కాల్చేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి.

పెద్దల సమక్షంలోనే పిల్లలు పటాకులు కాల్చాలి..

ఎ.వనిత, కంటి వైద్య నిపుణురాలు, ఆర్పీ సూపర్​ స్పెషాలిటీ హాస్పిటల్​
పిల్లలు తప్పకుండా పెద్దల సమక్షంలోనే పటాకులు కాల్చాలి. బాణాసంచా కాల్చేటప్పుడు తప్పనిసరిగా దూరంగా మెయింటెన్​ చేయాలి. జనాలు లేని ప్రాంతాల్లో పటాకులు కాలిస్తేనే మంచిది. ఒకవేళ కంటికి గాయాలైతే ఎట్టి పరిస్థితుల్లో నలపొద్దు. ఐడ్రాప్స్​, ఆయింట్​మెంట్​లు వాడకుండా ముందుగా కంటి వైద్యనిపుణులను సంప్రదించాలి.

ఇది కూడా చదవండి..: Gambling Crackdown | పేకాట నిరోధానికి ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు: సీపీ సాయిచైతన్య

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *