అక్షరటుడే, వెబ్‌డెస్క్: Fake IPL Ticket Apps | దేశవ్యాప్తంగా ఐపీఎల్ సందడి నెలకొంది. ప్రస్తుతం సీజన్ ఉత్కంఠగా సాగుతోంది. ఏ జట్టు ప్లే ఆఫ్స్ చేరుతుందో తెలియని పరిస్థితి. దీంతో ప్రతి మ్యాచ్‌కు ప్రేక్షకులు భారీగా తరలి వస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం (Uppal Stadium)లో ఈ నెల 22న జరగనున్న మ్యాచ్టికెట్లకు సైతం భారీగా డిమాండ్ ఉంది.
ఉప్పల్ స్టేడియం వేదికగా ఈనెల 22న సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు క్రేజ్ ఉండటంతో ఇప్పటికే ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ టికెట్ రేట్లను భారీగా పెంచింది. దీంతో ఈ క్రేజ్‌ను కొందరు సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. టికెట్ల కోసం అభిమానుల్లో ఉన్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని, నకిలీ యాప్‌లు, వెబ్‌సైట్ల ద్వారా దోపిడీకి తెరలేపారు.
Fake IPL Ticket Apps | ఫేక్ యాప్స్‌తో..
ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఐపీఎల్ టికెట్ల (IPL Tickets) బుకింగ్‌కు సంబంధించి అనేక ప్రకటనలు దర్శనమిస్తున్నాయి. అధికారిక టికెటింగ్ భాగస్వామి అయిన ‘డిస్ట్రిక్ట్’ (District) యాప్‌ను పోలిన రంగులు, లోగోలతో ఉన్న నకిలీ యాప్‌లను సృష్టించి, తక్కువ ధరకే టికెట్లు ఇస్తామంటూ ప్రకటనలు ఇస్తున్నారు. అచ్చం అసలు యాప్‌ను తలపించేలా ఉన్న ఈ నకిలీ లింకులను క్లిక్ చేసి టికెట్లు బుక్ చేసుకుంటే, మీ సొమ్ము గల్లంతవ్వడం ఖాయం. పేమెంట్ చేసిన తర్వాత టికెట్లు రాకపోగా, మీ బ్యాంకింగ్ వివరాలు కూడా సైబర్ నేరగాళ్ల పరమయ్యే ప్రమాదం ఉందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు.
Fake IPL Ticket Apps | అప్రమత్తంగా ఉండాలి
మ్యాచ్ చూడాలనే ఉత్సాహంతో సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక లింకులను నమ్మి మోసపోవద్దని సజ్జనార్ సూచించారు. ఇలాంటి ఫేక్ యాప్‌లు, వెబ్ సైట్స్‌పై నిఘా పెట్టినట్లు వెల్లడించారు. ఎవరైనా ఇటువంటి ఫేక్ యాప్స్ లేదా వెబ్‌సైట్ల గురించి సమాచారం తెలిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.
ఇది కూడా చదవండి..: Hyderabad Bengaluru High Speed Rail | నల్లమల మీదుగా హైస్పీడ్ రైలు.. సర్వే కొలిక్కి


