Giacomo Filibeck Bharat Summit | భారత్ సమ్మిట్‌లో విదేశీ నేత వ్యాఖ్యల కలకలం.. ఇటలీ ప్రతినిధిని డీపోర్ట్ చేయాలని బీజేపీ డిమాండ్..

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Giacomo Filibeck Bharat Summit | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘భారత్ సమ్మిట్’ వేదికగా ఇటలీ రాజకీయ నాయకుడు జియకోమో ఫిలిబెక్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. భారత అంతర్గత రాజకీయాలపై ఓ విదేశీ ప్రతినిధి వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా తప్పుపడుతూ తెలంగాణ బీజేపీ నేతలు స్పందించారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ( Ramchander Rao )సోమవారం శంషాబాద్ ఇమ్మిగ్రేషన్ కార్యాలయంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఫిలిబెక్ గనుక దేశంలో ఉంటే వెంటనే అతడిని డీపోర్ట్ చేయాలని, ఒకవేళ ఇప్పటికే విదేశాలకు వెళ్లిపోయి ఉంటే తిరిగి భారత్‌లో అడుగుపెట్టకుండా నిషేధం విధించాలని ఆయన డిమాండ్ చేశారు.

Giacomo Filibeck Bharat Summit | దేశ వ్యతిరేక నినాదాలు..

కొన్ని దేశాల్లో అయితే ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని కాల్చిపారేసేవారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సమ్మిట్ వేదికగా దేశ వ్యతిరేక నినాదాలు వినిపించాయని.. ఓ వైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలకు చప్పట్లు కొట్టడం సిగ్గుచేటని ఆరోపించారు. ఇంతకంటే దేశద్రోహం వేరే ఉంటుందా అని ప్రశ్నించిన ఆయన, ఈ సమ్మిట్ నిర్వహణ బాధ్యులు , నిర్వాహకులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలోనే డీజీపీని నేరుగా కలిసి మరోసారి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

Giacomo Filibeck Bharat Summit | ఇటలీ ఎంపీ రియాక్షన్..

భారత్ సమ్మిట్‌లో ప్రసంగించిన ఇటలీ నేత జియకోమో ఫిలిబెక్.. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ‘ఓటు చోరీ’ అంశాన్ని ప్రస్తావించారు. సభలోనే ‘ఓట్ చోర్.. గద్దీ ఛోడ్’ అంటూ వివాదాస్పద నినాదాలు చేశారు. మన దేశ రాజకీయ వ్యవహారాల్లో ఒక విదేశీ వ్యక్తి వచ్చి జోక్యం చేసుకోవడం, నినాదాలు చేయడంపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఈ వివాదంపై ఇటలీ అధికార పార్టీ ‘ఫోర్జా ఇటాలియా’ (Forza Italia) పార్లమెంట్ సభ్యురాలు, జాతీయ డిప్యూటీ సెక్రటరీ డెబోరా బెర్గామిని స్పందించారు. భారతదేశ అంతర్గత రాజకీయ వివాదాల్లో యూరోపియన్ నేతలు జోక్యం చేసుకుని మాట్లాడటం ఏమాత్రం సమంజసం కాదని ఆమె స్పష్టం చేయడం గమనార్హం.

Giacomo Filibeck Bharat Summit | కాంగ్రెస్‌కు కొత్త చిక్కులు..

మొదటి నుంచీ భారత్ సమ్మిట్ నిర్వహణపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ఈ సమావేశాన్ని బీజేపీ నేతలు ‘దేశద్రోహుల సభ’ అని విమర్శిస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో విదేశీ గడ్డకు చెందిన నేతతో మన దేశ రాజకీయాలపై విమర్శలు చేయించి, వాటికి కాంగ్రెస్ పెద్దలు మద్దతుగా నిలిచారంటూ బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఈ పరిణామాలు అధికార కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి:  KTR Uttam Kumar Reddy | ఈ మధ్యకాలంలో నేను విన్న బెస్ట్ జోక్ ఇదే’.. మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలపై కేటీఆర్ సెటైర్లు..

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *